అమెజాన్-ఈ సంస్థ పేరు తెలియని వారు లేరు. ఆన్లైన్ షాపింగ్.. పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరికీ చేరువైన కంపెనీ ఇది. ఈ కంపెనీ.. ఇప్పుడు తెలంగాణలో 20,761 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇటీవలే తెలంగాణ సర్కారుతోనూ చర్చలు పూర్తి చేసింది. వచ్చే మూడేళ్లలో హైదరాబాద్‌ను భారీ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. 2022 నాటికి ఈ సేవలు సైతం అందుబాటులోకి వచ్చేలా తెలంగాణ సర్కారు వడివడగా అడుగులు వేస్తోంది. అంతేకాదు.. తెలంగాణ పుట్టిన తర్వాత.. ఇంత భారీ పెట్టుబడితో ఓ సంస్థ రావడం .. ఇదే తొలిసారని.. మంత్రి కేటీఆర్ సంతోషంగా వ్యక్తం చేశారు.
ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కంపెనీ.. మొదట్లో ఏ రాష్ట్రాన్ని ఎంచుకుం ది? ఎవరితో చర్చలు జరిపింది? అనే విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అత్యంత ప్రజాదరణ ఉన్న అమెజాన్ .. ఆదిలో ఏపీని ఎంచుకుంది. 2018లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆహ్వానం మేరకు అమెజాన్ ప్రతినిధులు డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకుముందుకు వచ్చారు.
విశాఖ, అమరావతి ప్రాంతాల్లో భారీ ఎత్తున వెబ్ సిరీస్ ప్రారంబించాలని అనుకున్నారు. దీనికి అప్పటి చంద్రబాబు సర్కారు ప్రాధాన్యం ఇచ్చింది. అప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ స్వయంగా అమెజాన్ ప్రతినిధులతో భేటీ అయి.. పెట్టుబడులపై చర్చించారు.
ఇది ఇంకా చర్చల దశలో ఉండగానే.. చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పడే.. డేటా సెంటర్.. ప్రపంచానికి సైతం ఉపయోగపడుతుందని.. ప్రపంచ పటంలో ఏపీ ఠీవీగా నిలబడుతుం దని కూడా చెప్పుకొచ్చారు. అయితే, దీనిపై చర్చలు కొనసాగుతుండగానే రాష్ట్రంలో ఎన్నికలు రావడం, చంద్రబాబు సర్కారు స్థానంలో జగన్ ప్రభుత్వం ఏర్పడడం జరిగిపోయాయి. ఇక, అంతటితో అమెజాన్ పెట్టుబడుల ఊసు ఎత్తిన వారు .. ఈ విషయాన్ని మాట్లాడిన వారు కూడా కనిపించలేదు. పైగా 75 శాతం ఉద్యోగాలు .. లోకల్‌కే ఇవ్వాలనే జీవోతో అంతర్జాతీయ సంస్థలు ఒక్కొక్కటిగా వెనక్కి మళ్లాయి.
ఆదానీ కంపెనీకి కేటాయించిన 75 ఎకరాలను విశాఖలో జగన్ సర్కారు వెనక్కి తీసుకోవడం పెట్టుబడి దారుల్లో మరింత గుబులు రేపింది. మిగిలిన కంపెనీల్లో పెట్టుబడులపైనా.. సమీక్షలు చేయడం ప్రారంభించింది. దీంతో అమెజాన్.. తన ప్రతిపాదనను విరమించుకుంది. ఆవిషయం తెలుసుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ తానే స్వయంగా రంగంలోకి దిగి.. అమెజాన్ ప్రతినిధులను హైదరాబాద్‌కు తీసుకువచ్చి.. పెట్టుబడులపై ఓ క్లారిటీ తెచ్చుకున్నారు. భారీ రేంజ్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా స్థానికంగా ఐటీ రంగం మరిన్ని కొత్త పుంతలు తొక్కడంతోపాటు.. హైదరబాద్ ఆదాయం రెండు రెట్లు పెరుగుతుందనే అంచనాకు వచ్చారు.
వరుస సమావేశాల అనంతరం అమెజాన్ వెబ్ సిరీస్ తెలంగాణ చరిత్రలోనే భారీ ఎఫ్‌డీఐ రాబోతుండడం సంతోషంగా ఉందన్న కేటీఆర్.. రాష్ట్ర ముఖ చిత్రాన్ని అమెజాన్ మార్చేయడం ఖాయమని చెప్పకనే చెప్పారు. కానీ, ఈ ప్రయత్నమే ఏపీలో చంద్రబాబు సర్కారు చేసిందనే స్పృహ ప్రస్తుత జగన్ సర్కారుకు లేకపోవడం.. పెట్టుబడులు రావడమే అరుదుగా మారిన సమయంలో వచ్చిన వాటిని కూడా నిలుపుకోలేని పరిస్థితిని తీసుకురావడం.. అమెజాన్ వంటి సంస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. ఏదేమైనా.. జగన్ చేసిన తప్పుతో.. రాష్ట్రం ఓ అద్భుత అవకాశాన్ని మాత్రం కోల్పోయిందని అంటున్నారు పరిశీలకులు.