బెజవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ ఫ్యామిలీకి ‘కాపు’లు కాపు కాస్తుంటారు. వంగవీటి రంగా ఉన్నంత కాలం బెజవాడ రాజకీయాలలో తనదైన పాత్ర పోషించారు. ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాత్రం తన తండ్రి తరహాలో రాజకీయ గుర్తింపు సంపాదించుకోలేదన్న అభిప్రాయం ప్రజలలో ఉంది.
మొదట కాంగ్రెస్, ఆ తరువాత పీఆర్పీ, ఆ తరువాత వైసీపీలో చేరిన వంగవీటి రాధా… గత ఎన్నికలకు ముందు సడెన్ గా టీడీపీలో చేరారు. కొద్ది రోజుల క్రితం రాధా….జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో, రాధా ఏ పార్టీలోనూ నిలకడగా ఉండరన్న టాక్ ఉంది. కానీ, రాధా మాత్రం ఈ సారి టీడీపీలోనే కొనసాగాలని ఫిక్స్ అయ్యారని, దీంతో, రాధాకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే, వైసీపీలో చేరాలని రాధాను మంత్రి కొడాలి నాని కోరారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. 2019 ఎన్నికలలో సీటు విషయం మినహాయించి వైసీపీతో, సీఎం జగన్ తో రాధాకు విభేదాలు లేవు. దీంతో, రాధా కూడా అనవసరంగా వైసీపీని వీడానన్న భావనలో ఉన్నారని తెలుస్తోంది. దీనికితోడు, 2019 తర్వాత ఏపీలో మారిన సమీకరణాల నేపథ్యంలో వంగవీటి రాధా వైసీపీతో తన రాజకీయ భవిష్యత్తు చక్కదిద్దుకోవాలని డిసైడయినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి వంగవీటి రాధా, కొడాలి నానిల భేటీ చాలాకాలంగా వస్తున్న పుకార్లకు ఊతమిచ్చేలా ఉంది. గుడివాడలో వైసీపీ నాయకుడు పాలేటి సుబ్రహ్మణం మనవడి పుట్టిన రోజు వేడుకల్లో మంత్రి కొడాలి నానితో పాటు వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఆ వేదికపై నాని, రాధాలు పరస్పరం పలకరించుకున్నారు. అంతే కాదు….ఆ తర్వాత కొడాలికి చెందిన కె కన్వెన్షన్ అతిథి గృహంలో 2 గంటల పాటు భేటీ అయ్యారని తెలుస్తోంది.
రాధా రాజకీయ భవిష్యత్తుపై వారిద్దరూ తీవ్రంగా చర్చించారని, రాధాను మరోసారి వైసీపీలోకి నాని ఆహ్వానించారని ప్రచారం జరుగుతోంది. జగన్ తో మాట్లాడి వైసీపీలో రాధాకు తగిన ప్రాధాన్యత కల్పించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేలా ఒప్పిస్తానని కొడాలి నాని హామీ ఇచ్చారని తెలుస్తోంది. మరి, ఈ ప్రచారంపై రాధా స్పందన ఏవిధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.