జబర్దస్త్ రాజకీయాలు చేయడంలో తనకు మించిన నాయకులు లేరని నిరూపిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకున్న రోజా ఈ విజయం వెనుక అందరి కృషి.. పార్టీనేతల సహకారం ఉందనే విషయాన్ని పక్కన పెట్టేశారనే విమర్శలు జోరుగా హోరుగా వినిపిస్తున్నాయి. సొంత పార్టీలో ఇప్పుడు ఆమె చాలా మంది నేతలకు శత్రువుగా మారిపోయారనే వాదన సర్వత్రా వినిపిస్తోంది.
జిల్లాకు చెందిన మంత్రులు..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి వంటి వారితో నిత్యం రగడకు దిగి.. సెంటరాఫ్‌ది టాక్‌గా మారిన రోజా.. ఇప్పుడు క్షేత్రస్థాయిలోనూ వివాదాలకు కేరాఫ్‌గా మారిపోతున్నారు. ఈ పరిణామం.. రోజా ఫ్యూచర్‌కే పెద్ద దెబ్బగా మారుతుందని పరిశీలకులు చెబుతున్నారు.
ఒక విజయం వినయాన్ని నేర్పాల్పి. విధేయతను చూపించాలి. కానీ, రెండు విజయాలు అందుకున్న రోజా.. ఈ రెండు పదాలను మరిచిపోయారని అంటున్నారు వైసీపీ నాయకులు. జిల్లాలో ఏ నాయకుడు కూడా రోజాకు పాజిటివ్‌గా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడకపోగా.. రోజా పేరు ఎత్తగానే తలలు పట్టుకునే పరిస్థితి వస్తోంది.
నిన్న మొన్నటి వరకు నగరి మాజీ మునిసిపల్ చైర్మన్ కేజే కుమార్ వర్గంతో వివాదానికి దిగిన రోజా.. ఏకంగా మంత్రి పెద్దిరెడ్డిపైనే తీవ్ర విమర్శలు చేశారు. అయితే.. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదం కావడం.. కేజే కుటుంబానికి అధిష్టానం నుంచి మద్దతు ఉందని తెలుసుకుని.. తర్వాత.. రోజానే వెనక్కి తగ్గిన పరిస్థితి ఏర్పడింది.
ఇక జిల్లాకే చెందిన మరో మంత్రి నారాయణ స్వామిపై కూడా ఆమె ఫైర్ అయ్యారు. ఇక, ఇప్పుడు.. శ్రీశైలం ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్, పార్టీలో బలమైన వర్గ నేత.. చక్రపాణి రెడ్డి, ఆయన సోదరుడు భాస్కరరెడ్డితోనూ వివాదం పెట్టుకుంటోన్న పరిస్థితే ఉంది.
నగరి నియోజకవర్గం పరిధిలోని నిండ్ర మండల పరిషత్ ఎన్నికల్లో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఏడు స్థానాలు వైసీపీ, ఒక స్థానం టీడీపీ మద్దతు దారు దక్కించుకున్నారు. అయితే.. వైసీపీకి దక్కిన ఏడుగురులో ఇద్దరు రోజాకు అనుకూలంగా మారారు. మరో ఐదుగురు చక్రపాణి వర్గంగా ఉన్నారు.
అయితే.. టీడీపీ అభ్యర్థిని తన వర్గంలో చేర్చుకున్న రోజా.. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో రోజా అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో రిటర్నింగ్ అధికారి కంటతడిపెట్టారు. తాము చెప్పినట్లే నడుచుకోవాలని రోజా అధికారులను బెదిరించారని ప్రచారం జరుగుతోంది.
రోజా ఫైర్ అవుతోన్న ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. దీంతో ఇప్పుడు రోజా వివాదం తాడేపల్లి వరకు చేరింది. దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అయితే.. ఇక్కడ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. మొత్తంగా చూస్తే.. రోజా సొంత నియోజకవర్గంలో సొంత పార్టీవారితోనే వివాదానికి దిగడం. మున్ముందు.. ఇబ్బందేనని అంటున్నారు పరిశీలకులు.