టాలీవుడ్ దర్శకుల్లో కాస్త భిన్నంగా వ్యవహరించే వారిలో శేఖర్ కమ్ముల ఒకరు. మంచి కాఫీ లాంటి సినిమాల్ని తీస్తారన్న పేరుతో పాటు.. ఏడాదికి ఒకట్రెండు అన్నట్లు కాకుండా.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చెప్పటానికి ఏళ్లకు ఏళ్లు తీసుకోవటం ఆయనకు అలవాటే.
తెలుగు సినిమాకు సంబంధించి శేఖర్ కమ్ముల మార్కు ఒకటి ఉంది. తెలుగు సినిమా చరిత్రలో ఆయనకో పేజీ కాదు.. చాప్టరే ఉందని చెప్పాలి. ఫీల్ గుడ్ మూవీస్ చేయటంలో ఆయన నేర్పు మిగిలిన వారికి భిన్నమైనవి.
రెండు దశాబ్దాల కాలంలో ఆయన చేసిన సినిమాలు కేవలం తొమ్మిదే. 2000లో డాలర్ డ్రీమ్స్ తో మొదలైన ఆయన ప్రయాణం.. నాలుగేళ్లకు ఆనంద్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు (2006)లో గోదావరితో ఆయన ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు.
గోదావరి మూవీ చేసిన ఏడాదికే హ్యాపీడేస్ చేశారు తప్పించి.. ఆ తర్వాత ఎప్పుడూ మూడు.. నాలుగేళ్ల గ్యాప్ తో మాత్రమే సినిమాలు ఆయన చేస్తుంటారు.
తాజాగా విడుదలైన లవ్ స్టోరీ మూవీనే తీసుకుంటే.. బ్లాక్ బస్టర్ మూవీ ‘‘ఫిదా’’ విడుదలైన నాలుగేళ్లకు ఈ మూవీ విడుదల కావటం గమనార్హం. ఆయన సినిమాల్లో పాత్రలు.. నిజ జీవితంలో మనింటి పక్కనో.. వీధి చివరనో ఉన్నట్లుగా ఉంటాయే కానీ.. వాస్తవానికి దూరమన్నట్లుగా ఉండవు.
ఈ టాలెంట్ తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తూ ఉంటుంది. తాజాగా ‘లవ్ స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు శేఖర్ కమ్ముల. ఇంత మంచి దర్శకుడిలోనూ ఒక వీక్ నెస్ ఆయన సినిమాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది.
ఫస్ట్ హాఫ్ ను చాలా ఈజ్ తో నడిపేసే శేఖర్ కమ్ముల.. సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి.. బండిని అంతే ఈజ్ తో లాగే విషయంలో ఆయన కిందామీదా పడుతుంటారు. తన బలాన్ని మొదటి హాఫ్ లో బ్రహ్మండంగా చూపించే ఆయన.. సెకండ్ హాఫ్ లో మాత్రం ఆయన తన బలహీనతను ఇట్టే చూపించేస్తుంటారు.
తాజా లవ్ స్టోరీలోనూ అదే సమస్యగా చెబుతారు. ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాల్లో అత్యధికం ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొనే పరిస్థితి. తాజా లవ్ స్టోరీలోనే సేమ్ ఇష్యూ రిపీట్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది. సెకండ్ హాఫ్ ను మరికాస్త జాగ్రత్తగా డీల్ చేయటంతో పాటు.. క్లైమాక్స్ ను సింఫుల్ గా చుట్టేసిన తీరు నిరాశకు గురి చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిందేదో జరిగింది.. తర్వాతి సినిమాకైనా సెకండ్ హాఫ్ బలహీనతను శేఖర్ కమ్ముల అధిగమిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది.