తెలంగాణలో వైఎస్సార్ టీపీ పార్టీ పెట్టి టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలని వైఎస్ షర్మిల చూస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిరుద్యోగుల సమస్యపై పలుమార్లు దీక్షలు, నిరసనలు చేపట్టారు షర్మిల. ఈ క్రమంలోనే ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష పేరుతో షర్మిల దీక్షలు చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆత్మహత్య చేసుకున్న ఓ నిరుద్యోగి కుటుంబాన్ని గతంలో పరామర్శించి దీక్ష చేసే క్రమంలో షర్మిలకు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్‌లో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి భూక్యా నరేష్ కుటుంబసభ్యులను పరామర్శించాలనుకున్న షర్మిలకు అతడి కుటుంబ సభ్యులు షాకిచ్చారు. షర్మిల నిరసన దీక్షకు తాము సహకరించబోమని నరేష్ కుటుంబ సభ్యులు ప్రకటించడంతో షర్మిలకు, వైఎస్సార్ టీపీ నేతలకు షాక్ తగిలినట్లయింది. షర్మిలను తమ ఇంటికి రావద్దని నరేష్ తండ్రి భూక్యా శంకర్ నాయక్ విజ్ఞప్తి చేయడంతో షర్మిల ఆ దీక్షను విరమించుకున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి షర్మిల నిరుద్యోగ దీక్షకు చుక్కెదురైంది. బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిరుద్యోగ-నిరాహార దీక్షను అడ్డుకున్న పోలీసులు…షర్మిలను అరెస్ట్ చేశారు. షర్మిలను మేడిపల్లి పీఎస్‌కు తరలించే ప్రయత్నంలో తీవ్ర ఉద్రికత్తత ఏర్పడింది. పోలీసులకు, వైఎస్ఆర్టీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో గందరగోళం ఏర్పడింది. చివరికి వైఎస్ఆర్టీపీ కార్యకర్తలను క్లియర్ చేసి…. వైఎస్ షర్మిల ను మేడిపల్లి పీఎస్ కు పోలీసులు తరలించారు.