జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, లా అండ్ ఆర్డర్ లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కూడా టీడీపీ నేతలపై వైసీపీ నేతలు అడపాదడపా దాడులకు తెగబడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతల దాష్టీకం తాజాగా పరాకాష్టకు చేరింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపైనే వైసీపీ నేతలు, కార్యకర్తలు రాళ్లదాడికి తెగబడడం కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. చంద్రబాబు క్షమాపణ చెప్పలని గొడవకు దిగి నానా హంగామా చేశారు. వారిని లోపలికి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. దీంతో, పెద్దపెద్ద రాళ్లు, కట్టెలతో ఇంటిపై దాడికి దిగారు. ఎమ్మెల్యే జోగి రమేష్ సమక్షంలో గొడవ జరుగుతున్నా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ దాడిలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పృహ తప్పి పడిపోయారు.
జోగి రమేష్, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అమరావతి పోరాట సమితి రైతులు, ప్రజలు భారీ సంఖ్యలో చంద్రబాబు నివాసానికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. డీజీపీ దగ్గరుండి మరీ వైసీపీ నేతలను బాబు ఇంటి వద్దకు పంపారని, ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. పట్టాభి మాట్లాడుతూ ఫ్యాక్టనిస్టు సీఎం అయితే ఇలానే ఉంటుందని మండిపడ్డారు. వైసీపీ నేతలు దాడికి పాల్పడుతుంటే.. పోలీసులు ఏమీ చేయలేదని, జగన్ ప్రోద్బలంతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.