ప్రకాశం జిల్లాలో కీలక నాయకుడు, వైసీపీ సీనియర్ నేత, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మంత్రి.. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పరిస్థితి ఏంటి ? ఆయనను ఇప్పుడు పట్టించుకునే వారే లేరా ? అంతా నాదే.. అన్నీ నేనే .. అని చెప్పుకొనే బాలినేనికి ఇప్పుడు పార్టీ నేతల నుంచి మొండి చేయి కనిపిస్తోందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిజానికి కాంగ్రెస్ హయాం నుంచి కూడా బాలినేనికి దూకుడు ఎక్కువనే పేరుంది. ఇక, వైఎస్ కుటుంబానికి బంధువు కూడా కావడంతో.. వైసీపీలోకి వచ్చిన తర్వాత జిల్లాలో తన హవా బాగానే చలాయిస్తున్నారని కూడా ప్రచారం ఉంది.
మంత్రి బాలినేని కనుసన్నల్లోనే జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయని.. ఇక్కడ ఇటు పుల్ల అటు పెట్టాలన్నా.. కూడా బాలినేని ఆదేశాలు అవసరమన్న విషయంలో సందేహాలు అక్కర్లేదు. పార్టీ అధికారంలో లేనప్పుడు బాలినేని ఎమ్మెల్యేగా ఓడి… జగన్ సొంత బాబాయ్ వైవి. సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలిచారు. అయినా కూడా జగన్ బాలినేనికే ఎక్కువ ప్రయార్టీ ఇస్తూ వచ్చారు. ఇక, నాలుగు స్థానాలు తప్ప.. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా మొత్తం వైసీపీ వశమైంది. దీంతో ఇక, అప్పటి నుంచి బాలినేని దూకుడు మరింత పెరిగింది. మంత్రి అయ్యాక.. అంతా ఆయన చేతుల మీదుగానే జరుగుతోందని అంటున్నారు. ఒకప్పుడు వైవీ సుబ్బారెడ్డి దూకుడు ఉండేది. అయితే.. ఇప్పుడు ఆయనను టీటీడీ చైర్మన్ చేశాక.. జిల్లా మొత్తంలో బాలినేనిదే హవా నడుస్తోంది.
నామినేటెడ్ పదవుల విషయంలోనూ.. బాలినేని దూకుడు చూపించారు. మరి ఇంతగా ఆయన హవా ఉందని చెబుతుంటే.. తాజాగా జరిగిన ఘటనలో మాత్రం ఆయన ఆటలో అరటి పండు మాదిరిగా అయి పోయారని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల తన స్నేహితుడి పుట్టిన రోజు కోసం.. రష్యాకు వెళ్లారు. ఆయన సొంత ఖర్చులతోనే.. ఈ పర్యటన పెట్టుకున్నా.. ప్రత్యేక జెట్ విమానంలో వెళ్లడం.. విమర్శలకు తావిచ్చింది. దీంతో అవకాశం కోసం ఎదురు చూసిన.. టీడీపీ నాయకులు దీనిని బాగానే వాడుకున్నారు.
చిత్రం ఏంటంటే.. అదే సమయంలో బాలినేని చూస్తున్న విద్యుత్ శాఖలో ట్రూ అప్ చార్జీల బాదుడు ఆసమయంలోనే జరిగింది. దీంతో మంత్రికి బాధ్యత లేదంటూ.. ప్రతిపక్షం నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే.. ఇంత జరిగినా.. ప్రకాశం జిల్లా నాయకులు.. అందునా.. వాసు అని ముద్దుగా పిలుచుకునే వారు కూడా.. ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఆయనను సమర్ధించలేదు. ప్రతిపక్షానికి కౌంటర్ ఇవ్వలేదు. చూసి చూసి.. బాలినేనే.. రష్యా నుంచి వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది.
బాలినేనిని పిచ్చగా వాడుకున్న వైసీపీ నేతలు, టీడీపీలో ఉండలేక ఆ పార్టీ నుంచి వైసీపీలోకి రావడంలో బాలినేని సహకారం తీసుకున్న వారు కూడా ఈ విషయంలో తమకేం పట్టనట్టుగా వ్యవహరించారు. వారికి అవసరం ఉన్నప్పుడు బాలినేని ఎంత సాయం చేస్తున్నా.. బాలినేని కష్టాల్లో ఉంటే మాత్రం ఆయనకు చిన్న సాయం కూడా చేయడం లేదు. సో.. దీనిని బట్టి.. వాసును సొంత పార్టీ నేతలే అవసరానికో రకంగా వాడుకుంటున్నారని తెలుస్తోంది.