మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ వి.కనగరాజ్ పేరు ఏపీలో చాలామందికి తెలుసు. ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కు ఎసరు పెట్టేందుకు ఎస్ఈసీగా జస్టిస్ కనగరాజ్ ను ఆఘమేఘాల మీద రూల్స్ సవరించి మరీ జగన్ నియమించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక, కనగరాజ్ నియామకం చెల్లదని సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో ఆయనకు తొలిసారి భంగపాటు తప్పలేదు. ఈ క్రమంలోనే జస్టిస్ కనగరాజ్ కు న్యాయం చేసేందుకు జగన్..ఏపీ పీసీఏ చైర్మన్ గా జస్టిస్ కనగరాజ్ ను నియమిస్తూ కొద్ది రోజుల క్రితం జగన్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.
అయితే, గతం నుంచి పాఠాలు నేర్వని జగన్…మరోసారి నిబంధనలు తుంగలో తొక్కి జస్టిస్ కనగరాజ్ ను నియమించారని విపక్ష నేతలు గతంలో విమర్శలు గుప్పించారు. పీసీఏ చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి 65 ఏళ్ల వయసు వచ్చేవరకు.. లేదంటే మూడేళ్లు.. ఏది ముందైతే అప్పటి వరకు ఆ పదవిలో ఉండొచ్చన్న నిబంధనలను జగన్ గాలికి వదిలేసి 75 ఏళ్ల వయసున్న జస్టిస్ కనగరాజ్ ను నియమించారని విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా జస్టిస్ కనగ రాజ్ నియామకంపై లాయర్ పారా కిషోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్ పై నేడు విచారణ జరిపిన హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సర్కార్ జీవో జారీ చేసినందున హైకోర్టు ఆ నియామకాన్ని సస్పెండ్ చేసింది. కనగరాజ్ నియామకం చెల్లదని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. పిటిషనర్ తరపున న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు.
హైకోర్టు తాజా తీర్పుతో జస్టిస్ కనగ రాజ్ ను మరోసారి భంగపాటుకు గురి చేసిన జగన్…ముచ్చటగా మూడోసారి కూడా పప్పులో కాలేసేలా ఏదన్నా తప్పు చేస్తారా…లేక సైలెంట్ గా ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయినా, ఈ సారి జగన్ పిలిచి పదవిస్తానని చెప్పినా జస్టిస్ కనగరాజ్ రాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కనగరాజ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.