బయోపిక్.. కొన్నేళ్ల ముందు మంచి డిమాండ్ కనిపించిన జానర్. హిందీలో స్పోర్ట్స్ బయోపిక్స్ అద్భుతమైన ఆదరణ దక్కించుకోవడం.. అదే సమయంలో తెలుగులో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తీసిన ‘మహానటి’ కూడా గొప్ప విజయాన్నందుకోవడంతో నిజ జీవిత వ్యక్తుల జీవితాలను వెండితెరపైకి తీసుకెళ్లడానికి తెగ ఉత్సాహం చూపించారు ఫిలిం మేకర్స్.
ఐతే ఇంతకుముందు వచ్చిన బయోపిక్స్‌లో ఒక సిన్సియారిటీ కనిపిస్తే.. ఆ తర్వాత వచ్చిన బయోపిక్స్‌లో అది మిస్సయింది. ముఖ్యంగా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తుల గురించి సినిమాలు తీస్తే జనాలకు ఏమాత్రం రుచించడం లేదు. ఆ సినిమాలను ఎంత బాగా తీసినా కూడా తిరస్కరిస్తున్నారు.
రాజకీయ ప్రయోజనాలు ఆశించడం వల్లో.. లేకుంటే తాము ఎవరి జీవితాలను వెండితెరకు ఎక్కిస్తున్నామో ఆ వ్యక్తుల గురించి హైప్ చేసి చూపించాలన్న ప్రయత్నం వల్లో కానీ ఈ బయోపిక్స్ పక్కదారి పడుతున్నాయి.
సినీ నటుడిగానే కాక రాజకీయ నాయకుడిగా కూడా శిఖర స్థాయిని అందుకున్న నందమూరి తారక రామారావు జీవితంపై సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎలా తిరస్కరించారో తెలిసిందే. అందులో ఎగ్జాజరేషన్లు ఎక్కువైపోవడం.. వాస్తవాలను చాలా వరకు దాచేయడం.. కన్వీనియెంట్గా సినిమా తీయడంతో ప్రేక్షకులకు రుచించలేదు. పైగా ఎన్నికల ముంగిట ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడంతో రాజకీయ ప్రయోజనం ఆశిస్తున్నారనే అభిప్రాయం జనాల్లో ఏర్పడింది.
వైఎస్సార్ మీద తీసిన ‘యాత్ర’లోనూ ఇది కనబడింది. కాకపోతే ఆ సినిమాకు మరీ హైప్ లేదు. దర్శకుడు ఈ సినిమాను క్లాస్‌గా తీయడంతో అది పర్వాలేదనిపించింది. మరోవైపు హిందీలో నరేంద్ర మోడీ మీద ఒకటికి రెండు సినిమాలు తీసేశారు. అందులో టూమచ్ ఎగ్జాజరేషన్లు ఉండటంతో ప్రేక్షకుల నుంచి కనీస స్పందన కూడా లేకపోయింది.
ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను టార్గెట్ చేస్తూ ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అంటూ నెగెటివ్ వేలో ఒక బయోపిక్ తీస్తే దాన్నీ జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడేమో తమిళంలో ‘తలైవి’ పేరుతో జయలలిత బయోపిక్ వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు ఎ.ఎల్.విజయ్ చాలా బాగా తీశాడనే చెప్పాలి.
కానీ ఇందులోనూ జయలలిత నెగెటివ్ కోణాలేవీ చూపించకుండా కన్వీనియెంట్గా సినిమా తీయడంతో ఇది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది. తమిళనాడులోనే సరైన స్పందన తెచ్చుకోని ‘తలైవి’ మిగతా చోట్ల వీకెండ్లోనే అడ్రస్ లేకుండా పోయింది.