మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు కమ్ సినీ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురి కావటం తెలిసిందే. తన ముందున్న బైక్.. ఆటోను ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేయటం.. ఆ సమయంలో బైక్ బ్యాలెన్సు తప్పటం.. వెంటనే కిందపడి దొర్లుకుంటూ వెళ్లటం లాంటివి తెలిసిందే.. ఈ ప్రమాదం జరిగిన వేళలో.. పక్కనే మరో బైక్ మీద ఉన్న అబ్దుల్ ఫరాన్ అనే యువకుడు.. తన బండిని ఆపి తేజ్ కు సాయం చేసి.. సపర్యలు చేసే ప్రయత్నం చేశాడు.
ఇతనే 108 అంబులెన్సుకు.. డయల్ 100కు ఫోన్ చేసి ప్రమాదం గురించి సమాచారం అందించాడు. ఇతను నిజాంపేటలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ లోని వాలెట్ పార్కింగ్ లో పని చేస్తుంటాడు. తాను వెళుతున్న వేళలో.. తన బైక్ ను తేజ్ ఓవర్ టేక్ వెళ్లాడని.. తాను చూస్తుండగానే తన వెనుక నుంచి దూసుకొచ్చి కింద పడి పల్టీలు కొడుతూ ముందుకు దొర్లిపోయారని.. కళ్ల ముందు అంత సినిమా ఫైట్ లా అనిపించిందన్నారు.
‘వెంటనే బండిని ఆపాను. తేజ్ కింద పడిపోయి ఉన్నాడు. లేపి కూర్చోబెట్టాం. నేను సాయిధరమ్ తేజ్ ను గుర్తు పట్టలేదు. నీళ్లు తాగించే ప్రయత్నం చేశా. ఆయన నీళ్లు తాగే స్థితిలో లేరు. షర్టు చిరిగి పోయింది. కిందిపడ్డప్పుడు హెల్మెట్ ఎగిరిపోయింది. కనురెప్పపై గాయం రక్తం కారుతోంది. ఛాతీ.. కాలు ఇతర భాగాల్లో గాయాలయ్యాయి. బైక్ హ్యాండిల్ బెండ్ అయ్యింది. బైక్ తీసి పక్కన పెట్టాం. అతను ఎవరో తెలుసుకోవటానికి ఫ్యాంటు జేబులో నుంచి ఫోన్.. పర్సు తీసి చూశాం. ఫోన్ స్క్రీన్ లాక్ చేసి ఉండటంతో.. కాంటాక్ట్స్ ఓపెన్ కాలేదు. పర్సులో డబ్బులు ఉన్నాయి. దీంతో.. అది అతని జేబులో పెట్టేశాం’’ అని చెప్పారు.
ప్రమాదం జరిగిన పది నిమిషాలకు అంబులెన్సు వచ్చిందని.. కొద్ది దూరం దాని వెంట తాను వెళ్లానని.. తనతో పాటు తన కుటుంబ సభ్యులు ఉండటంతో ఆసుపత్రికి వెళ్లలేక ఇంటికి వెళ్లిపోయినట్లు చెప్పారు. అంబులెన్సు వచ్చిన వేళలో.. అతన్ని సాయి ధరమ్ తేజ్ గా గుర్తించామన్నారు. తాను ఇంటికి వెళ్లిన తర్వాత.. తనకు రాయదుర్గం పోలీసులు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని.. అయితే.. సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యుల నుంచి మాత్రం తనకు ఫోన్ ఏమీ రాలేదని చెప్పాడు.