ప్రభుత్వ జీవోలను వెబ్ సైట్ లోనుంచి తీసివేయడంతో జగన్ సర్కార్ పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంపై కోర్టులో నేడు విచారణ జరిగింది. జీవోలను ఆన్లైన్లో ఉంచకపోవడం, ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 100 …సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4కి విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు.
అన్ని జీవోలను ఆన్లైన్లో ఉంచితేనే పారదర్శకత ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఎందుకు సవాల్ చేయలేకపోయారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలోనే సోమవారం పూర్తి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలిపారు. దీంతో, ఈ పిటిషన్లపై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
‘ఏపీ ఈ-గెజిట్’ ద్వారా జీవోలను ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో ఐఆర్ వెబ్సైట్ను నిలిపివేశామని, సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా వివరాలను ఈ-గెజిట్లో ఉంచబోతున్నామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ప్రజలకు అవసరం లేని వ్యక్తిగతమైన సమాచారం, తక్కువ మొత్తంలోని ఖర్చులు, అధికారుల సెలవులు, గోప్యంగా ఉంచాల్సిన ఇతర అంశాలను అందులో అందుబాటులో ఉంచబోమని స్పష్టం చేశారు. ఇకపై అన్ని జీవోలు అధీకృత అధికారి డిజిటల్ సంతకంతో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.