నాలుగేళ్ల క్రితం అటకెక్కిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు తేనెతుట్టెను తాజాగా ఈడీ కదిపిన సంగతి తెలిసిందే. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ అప్రువర్ గా మారి కీలక సమాచారం ఇవ్వడంతో 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటిసులిచ్చి వంతులవారీగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లవిచారణ పూర్తికాగా…త్వరలో మిగతావారినీ విచారణ జరిపేందుకు షెడ్యూల్ ఖరారైంది.
అయితే, తాజాగా డ్రగ్స్ కేసు విచారణ మొత్తం హీరో నవదీప్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎఫ్ లాంజ్ పబ్ చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ లాంజ్ లో సినీ ప్రముఖులు భారీగా పార్టీలు చేసుకుంటుంటారు. ఎఫ్ లాంజ్ పబ్బులో 2015 నుంచి 2018 వరకు వీకెండ్ లో నిత్యం పార్టీలు జరిగేవని ఈడీ గుర్తించింది. అక్కడ జరిగే పార్టీలను నవదీప్, రకుల్, రానా దగ్గుపాటి, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కలిసి నిర్వహించినట్లుగా ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఇక, పూరీ, ఛార్మిలు కూడా చాలాసార్లు ఎఫ్ లాంజ్ పబ్ లో పార్టీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎఫ్ లాంజ్ పబ్ మేనేజర్ కు భారీ మొత్తంలో నిధుల బదలాయింపులు జరిగాయని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, అక్కడ జరిగే పార్టీలలో సినీ ప్రముఖులకు కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేసేవాడని, అందుకే ఈడీ ఎఫ్ లాంజ్ పబ్ పై ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. ఆ క్లబ్ వేదికగానే డ్రగ్స్ సరఫరా, నగదు బదిలీలు జరిగాయని తెలుస్తోంది.
అయితే, డ్రగ్స్ వ్యవహారం నవదీప్ అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. మరోవైపు, ఈ నెల 8న రానా దగ్గుబాటి, 9న రవితేజతో పాటు శ్రీనివాస్, 13న నవదీప్తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే విచారణ జరిపిన సమయంలో బ్యంకు లావాదేవీలపైనే ముఖ్యంగా ఈడీ అధికారులు ఫోకస్ చేశారని తెలుస్తోంది.