తమ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటుందని, అందరికీ న్యాయం చేస్తుందని జగన్ గొప్పలు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే, కులవృత్తిదారులకు ఓ చేత్తో పథకాల పేరుతో డబ్బులిస్తున్న జగన్…మరో చేత్తో పొట్టకొడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వేటకు వెళ్లకుండా ఇళ్లదగ్గర ఉన్న సమయంలో మత్స్యకారులను ఆదుకుంటామని చెప్పిన జగన్….మత్స్యకారుల పొట్టకొట్టేలా జగన్ తీసుకువచ్చిన జీవో నెం.217పై మత్స్యకార సంఘాల నేతలు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన మత్స్యకార సంఘాల ప్రతినిధులు తమ గోడును వెళ్లగక్కారు. ఈ క్రమంలోనే మత్స్యకారులకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసానిచ్చారు. జీవో నెం.217తో మత్స్యకారుల మెడకు ఉరిబిగించాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఓపెన్ ఆక్షన్తో మత్స్యకారుల చేపల చెరువులను ఆక్రమించేందుకు వల వేసి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
కులవృత్తిదారుల పొట్టగొట్టేలా జగన్ రోజుకో జీవో తెస్తున్నారని మండిపడ్డారు. ఓ వైపు కోర్టులో కేసు కొనసాగుతుంటే మరోవైపు జీవోలు ఎలా ఇస్తారని చంద్రబాబు నిలదీశారు. చేపల చెరువులు మత్స్యకార సొసైటీలకే చెందాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇష్టారీతిన తెస్తున్న అడ్డగోలు జీవోలపై ఉద్యమిస్తేనే న్యాయం జరుగుతుందని. భయపడితే బానిసలుగా మిగులుతారని చంద్రబాబు మత్స్యకారుల్లో ధైర్యం నింపారు.
అంతకుముందు, జీవో నెం.217పై మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర నిప్పులు చెరిగారు. మత్స్య కారుల సొసైటీ హక్కులను కాలరాస్తున్నారని, ఆన్ లైన్ లో చెరువుల టెండర్లంటూ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఈ జీవో మత్స్యకారుల పొట్టకొట్టేలా ఉందంటూ మండిపడ్డారు. ఈ జీవోను జగన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ జీవో ప్రతులను కొల్లు రవీంద్ర తగులబెట్టారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం మంత్రి సీదిరి అప్పలరాజు జీవో నెం.217పై నోరు మెదపడం లేదని, మత్స్యకారులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.