పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలు నటిస్తోన్న మల్టీస్టారర్ మూవీ “భీమ్లా నాయక్” ఫస్ట్ గ్లింప్స్ కొద్ది రోజులుగా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. లుంగీ పైకి కట్టి మరీ ఊర మాస్ లుక్ లో పవన్ ఇచ్చిన ఎంట్రీ…చెప్పిన డైలాగ్…సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భీమ్లా నాయక్ బీజీఎంకు థమన్ ఇచ్చిన దరువుకు తగ్గట్లుగా పవన్ దుమ్మురేపే ఫైట్ చేయడంతో ఈ ఫస్ట్ గ్లింప్స్ వీడియో పవన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్ప్ తెప్పించింది.
అయితే, నేడు పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్రం టైటిల్ సాంగ్…ఆ ఫస్ట్ గ్లింప్స్ ను బీట్ చేసేలా ట్రెండ్ అవుతోంది. పవన్ ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. భీమ్లా నాయక్ బ్యాక్ గ్రౌండ్ ను వివరించేలా ప్రముఖ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు థమన్ బీట్ అదిరిపోయింది. జానపదంతో మొదలయ్యే ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్…ఆ తర్వాత భీమ్లా నాయక్ క్యారెక్టరైజేషన్ ను చెబుతుంటూ పవన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్సే.
గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ తరహాలో సాగే ఈ పాట కొంచెం స్లోగా ఉన్నప్పటికీ…అందులో వాడిన పవర్ ఫుల్ పదాలు క్యాచీగా ఉన్నాయి.
దీంతో, విడుదలైన కొద్ది సేపట్లోనే ఈ టైటిల్ సాంగ్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది ‘ఖాకీ డ్రస్సు పక్కనెడితే ఈడే పెద్ద గూండా.. నిమ్మళంగ కనబడే నిప్పుకొండ.. ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా.. ఇస్త్రీ నలగని చొక్కా.. పొగరుగా తిరిగే తిక్క’ అంటూ భీమ్లా నాయక్ స్వభావాన్ని ఓ రేంజులో చెప్పేశారు. ‘ఎవ్వడైనా ఈడి ముందు గడ్డిపోచ.. ఎర్రి గంతులేస్తే విరిగిపోద్ది వెన్నుపూస.. కుమ్మడంలో వీడే ఒక బ్రాండు తెలుసా’ అంటూ మాస్ కు పూనకం తెప్పించేలా ఈ పాటను రామజోగయ్య రాశారు.
సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటరటైనమెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా, నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేశ్, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పయున్ కోషియుం చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.