గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా ఈ మధ్యన తెలంగాణ రాష్ట్రంలో అధికార.. విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో ఇష్టారాజ్యంగా తిట్టేయటం ఎక్కువైంది. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేయడం సర్వసాధారణంగా మారింది. నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అన్నట్లుగా.. తన ప్రత్యర్థులపై విరుచుకుపడే సీఎం కేసీఆర్ తీరుకు ఏ మాత్రం తగ్గనట్లుగా ఇప్పుడు విపక్ష నేతలూ విరుచుకుపడుతున్నారు. మిగిలిన నేతల్నిపక్కన పెడితే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు.. పలువురు కాంగ్రెస్.. బీజేపీ నేతలు సీఎంపై తమకున్న ఆగ్రహాన్ని తిట్ల దండకంలోకి మార్చడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇష్టారాజ్యంగా తిడుతున్నతీరును తీవ్రంగా తప్పు పట్టిన ఆయన.. ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టిన ఎపిసోడ్ లో కేంద్రమంత్రిని అరెస్టు చేసిన వైనాన్ని గుర్తు చేశారు కేటీఆర్. రాజకీయాల్లో తిట్ల కల్చర్ ను తీసుకొచ్చిందే కేసీఆర్ అంటూ మీడియా ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి కేటీఆర్.. ఉద్యమ సమయంలో విద్యార్థులు చనిపోతుంటే.. వారి ఉద్వేగాన్ని వెలిబుచ్చే క్రమంలో కేసీఆర్ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించాల్సి వచ్చిందన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రేను ఒక్క మాట అన్నందుకే కేంద్రమంత్రిని జైల్లో వేశారన్న కేటీఆర్.. ఇక్కడ సీఎంను ఇష్టారీతిన తిడుతున్నా భరిస్తున్నామన్నారు.
కొంతమంది జర్నలిస్టులు జర్నలిజం ముసుగులో సీఎం కేసీఆర్ ను ఇష్టమొచ్చినట్లుగా తిడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పత్రికా స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. కాంగ్రెస్.. బీజేపీ నేతలు దారుణంగా తిడుతుండడంతో తాము కూడా అదే భాషలో ఎదురు సమాధానం ఇవ్వాల్సి వస్తోందన్న ఆయన.. తమ తిట్లను సమర్థించుకోవడం గమనార్హం. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ ప్రెస్ మీట్ జరిగిన గంటల వ్యవధిలోనే తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసినట్లుగా వార్తలు రావటం.. శుక్రవారం రాత్రికి అధికార ప్రకటన విడుదల కావటం గమనార్హం. మొత్తంగా.. సీఎం కేసీఆర్ ను తిట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ మంత్రి కేటీఆర్ చేసిన వార్నింగ్ వెంటనే అమలులోకి వచ్చినట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.