- జగన్ సర్కారుపై కన్నెర్ర
- ‘ఉద్యోగాల విప్లవం’ పేరిట
- పచ్చి అబద్ధాలతో ప్రభుత్వ ప్రకటన
- పీటీడీలోకి మారిన ఆర్టీసీ సిబ్బందీ ఆ ఖాతాలోకే
- ఔట్ సోర్సింగ్ పోస్టులూ తమ ఘనతేనట
- కరోనాలో 6 నెలల కోసం ఇచ్చినవీ కొలువులే!
- పాత నోటిఫికేషన్లకు ఆర్డర్లు ఇచ్చి ‘కొత్త కలరింగ్’
- నిరుద్యోగుల ఆందోళనలతో అట్టుడుకుతున్న రాష్ట్రం
జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా ‘జాబ్ క్యాలెండర్ విడుదల’ అంటూ భారీ ఖర్చుతో పత్రికలకు మొదటి పేజీ ప్రకటనలు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఫొటో.. వైసీపీ రంగుల పతాక రెపరెపలతో.. ‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం’ అని ఊదర గొట్టింది. రెండేళ్లలో 6,03,756 పోస్టులు భర్తీ చేసినట్లు ప్రకటించింది.
శాఖల వారీగా ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా లెక్కలు చెప్పింది. వాటిని చూసి ఆయా శాఖల అధికారులతో పాటు వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. వాట్సా్‌పలో షేర్ చేసుకుని మరీ నవ్వుకుంటున్నారు. నిరుద్యోగులైతే విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ ప్రకటన బోగస్ కావడమే దీనికి కారణం.
ప్రభుత్వం చెప్పేది నిజమైతే ఉద్యోగాలు ఇచ్చినవారి పేర్లు, ఫోన్ నంబర్లు వెబ్సైట్లలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ప్రగతి పుస్తకంలో 4.77 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 15 రోజుల్లోనే మరో 1.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేశారా అని యువత నిలదీస్తున్నారు.
వాస్తవానికి గత రెండేళ్ల పాలనలో ప్రభుత్వం కల్పించినట్లుగా చెబుతున్న ఉద్యోగాల కంటే… ప్రభుత్వ దోపిడీ విధానాల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 10 రెట్లు ఉంటుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా… ఇప్పుడు కేవలం 10,143 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని విమర్శిస్తున్నాయి.
ఇంత మోసమా?
ఈ రెండేళ్లలో రవాణా, ఆర్‌అండ్‌బీలో 51,387 రెగ్యులర్ పోస్టులు భర్తీ చేసినట్లు జగన్ సర్కారు ప్రకటించుకుంది. వాస్తవానికి ఈ రెండేళ్లలో ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాలకు టెస్ట్‌లు పెట్టలేదు. కండక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు చేయలేదు. క్లరికల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. సూటిగా చెప్పాలంటే ఆర్టీసీలో కొత్త ఉద్యోగాల కోసం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు.
మరి 51 వేలకు పైగా పర్మినెంట్ ఉద్యోగాలు ఎక్కడివి? ఎలా ఇచ్చారని ఆర్టీసీ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆ 51 వేలమందిలో ఒక్కరూ కొత్తగా నియమితులైన వారు కారు. ఏళ్లతరబడి ఉద్యోగాలు చేస్తున్న వారే. ఆర్టీసీలో 20వేల మంది డ్రైవర్లు, 18వేల మంది కండక్టర్లు, ఏడువేల మంది మెకానికల్ సిబ్బంది, ఆఫీస్ స్టాఫ్, ఇతర అధికారులు కలిపి 51వేల మందికి పైగా పని చేస్తున్నారు.
ఆర్టీసీని గత ఏడాది జనవరిలో ప్రభుత్వంలో విలీనం చేసి… ‘ప్రజా రవాణా శాఖ’ అనే కొత్త విభాగంలో వీరిని కలిపేశారు. అప్పటి నుంచి కార్పొరేషన్ ద్వారా కాకుండా.. ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. ఇదీ అసలు విషయం! కానీ తామందరికీ జగన్ కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్లుగా చెప్పుకోవడంపై ఆర్టీసీ సిబ్బంది నవ్వుకుంటున్నారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1987లో ప్రైవేటు బస్సుల జాతీయీకరణ జరగడంతో ఆర్టీసీ ఆసియాలోనే పెద్ద రవాణా సంస్థగా ఏర్పడింది. అప్పట్లో ప్రైవేటు బస్సుల్లో పని చేసే కార్మికులంతా ఆర్టీసీ ఉద్యోగులుగా మారారు.
త్వరలో పదవీ విరమణ చేయనున్న ఒక ఉద్యోగి మాట్లాడుతూ… ‘‘నాకు ఎన్టీఆర్ నిర్ణయం వల్లే ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది. నాలాగా ఎందరో ఉన్నారు. ఇప్పుడు… మమ్మల్ని జగన్ నియమించినట్లు చెప్పుకొంటున్నారు. ఈ ప్రకటన చూడగానే నవ్వొచ్చింది’’ అని వ్యాఖ్యానించారు.
వలంటీర్లా… ఉద్యోగులా?
జగన్ ప్రభుత్వం చెబుతున్న ఆరు లక్షల ఉద్యోగాల్లో.. 2.59 లక్షలు గ్రామ, వార్డు వలంటీర్లే. వీరికి ప్రభుత్వం నెలకు ఇచ్చే గౌరవ వేతనం రూ.5 వేలు మాత్రమే. ఈ మొత్తం పెంచాలని వారు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగితే.. ‘మీరు చేస్తున్నది ఉద్యోగం కాదు. అందుకు గౌరవ వేతనం చెల్లిస్తున్నాం.
మీరు సేవ చేస్తున్నారు కాబట్టే, ప్రజల్లో గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి’ అని జగన్ హితోక్తులు పలికారు. కానీ నియామకాల విషయానికి వచ్చేసరికి వారందరినీ ఔట్ సోర్సింగ్’ ఉద్యోగుల కోటాలో కలిపేశారు.
రెండేళ్లలో ఇచ్చామంటున్న 6 లక్షల ఉద్యోగాల్లో దాదాపు సగం వలంటీరు పోస్టులే ఉండటం గమనార్హం. మరో 1.21 లక్షల రెగ్యులర్ ఉద్యోగాలు గ్రామ, వార్డు సచివాలయాలకు చెందినవి. ఈ వ్యవస్థను కొత్తగా ఏర్పాటు చేయడంతో.. ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా ఈ నియామకాలు చేపట్టింది.
ఔట్ సోర్సింగ్… ఇచ్చారా?
ఈ రెండేళ్లలో 95,212 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించినట్లు జగన్ సర్కారు ప్రకటించింది. ఇది కూడా ‘ఆర్టీసీ’ కొలువుల్లాంటి అబద్ధమే. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది పని చేయడం కొత్తేమీ కాదు. జగన్ కొత్తగా ఏం చేసిందంటే… అప్పటికే ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 95 వేల మందిని ఒక కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. వీరిని కొత్తగా నియమించలేదు.
పోస్టులను భర్తీ చేయలేదు. ‘సమాన పనికి సమాన వేతనం. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ ఒకటో తేదీనే జీతాలు’ అని జగన్ అప్పట్లో ప్రకటించారు. కానీ వారికి 3 నెలల వేతనం పెండింగ్‌లో ఉండడం గమనార్హం. కరోనా కాలంలో ఆరు నెలల కాలానికి ఔట్ సోర్సింగ్‌పై తీసుకున్న సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా తీసేసి.. ఇప్పుడు ఆ ఉద్యోగాలనూ క్యాలెండర్లో చూపడం విశేషం.
ఇక ఏపీపీఎస్సీ ద్వారా 2,497 ఉద్యోగాలు తామే భర్తీ చేసినట్లు జగన్ ప్రభుత్వం ఘనంగా చెప్పుకొంది. నిజానికి ఈ పోస్టులకు 2018 డిసెంబరు 31న చంద్రబాబు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షల ప్రక్రియ అప్పుడే ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. గ్రూప్-2 రాసి అర్హత సాధించి, ఉద్యోగాలు పొందిన వారికి జగన్ అధికారంలోకి వచ్చాక నియామక పత్రాలు అందాయి.
ఇక… గ్రూప్ -1 పోస్టుల నియామక ప్రక్రియ కూడా చంద్రబాబు హయాంలోనే మొదలైంది. ఇంటర్వ్యూలు మాత్రమే జరగాల్సి ఉంది. వాటికీ హైకోర్టు ఈనెల 16న బ్రేకులు వేసింది. జగన్ సర్కారు హయాంలో ఇప్పటిదాకా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఒక్కటీ రాలేదు. గత ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో సెలెక్టయినవారికి ఇంతవరకు ఉద్యోగాలివ్వకుండా సతాయిస్తున్నారు.
ఎప్పుడు ఇచ్చారో!
వ్యవసాయ, సహకారశాఖల్లో గత రెండేళ్లలో 133 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ… శాఖాపరంగా ఎలాంటి నోటిఫికేషన్లూ వెలువడలేదు. కారుణ్య నియామకాలు, కోర్టు కేసులు పరిష్కారమై ఇచ్చిన పోస్టింగులను కూడా రెగ్యులర్ పోస్టుల భర్తీగా చూపారని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వేశారు. రాతపరీక్షలు, మెరిట్ జాబితా కూడా సిద్ధమైంది. కానీ… ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నియామక పత్రాలు ఇవ్వలేకపోయారు.
జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. వాటినీ ఇప్పుడు కొలువుల జాబితాలో చూపించారు. ఇక… సాంఘిక సంక్షేమశాఖలో ఇచ్చిన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకంటే, తీసేసినవే ఎక్కువ.
రాష్ట్రంలో ఏ ఆస్పత్రిలో చూసినా సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్యుల దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది వరకూ వేలల్లో పోస్టులు ఖాళీలున్నాయి. కరోనా సమయంలో సిబ్బంది కొరత కారణంగా ఆరు నెలల తాత్కాలిక పద్ధతిలో 26 వేల మంది సిబ్బందిని నియమించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇప్పుడు దానిని కూడా 6 లక్షల ఉద్యోగాల్లో కలిపేశారు. వీరంతా ఆరు నెలల పాటు మాత్రమే విధులు నిర్వహిస్తారని వారి జాయినింగ్ ఆర్డర్‌లోనే స్పష్టంగా చెప్పారు. వీరికి ఆరు నెలలకు గాను కేవలం నాలుగు నెలల జీతాలు మాత్రమే అందించారు. ఇలా తాత్కాలికంగా నియమించిన వారినీ 6 లక్షల మందిలో కలిపేయడం గమనార్హం.
యువతరం కదిలింది
‘జాబ్ క్యాలెండర్’పై యువతలో ఆగ్రహ జ్వాల ఉవ్వెత్తున ఎగిసింది. ‘ఉద్యోగ విప్లవం’ అంటూ ప్రభుత్వం చేసిన వంచనపై నిరసన ధ్వనులు మిన్నంటుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలతో కదంతొక్కుతున్నారు. మంత్రుల ఇళ్లు, కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నిస్తున్నారు.
యువజన సంఘాలు, పార్టీల అనుబంధ సంఘాలు, నిరుద్యోగ జేఏసీ పిలుపుతో రోడ్డెక్కి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. వైఎస్ జయంతినాడు అనంతపురం వెళ్లిన జగన్‌కు కూడా నిరసనల సెగ తగిలింది. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నింటినీ చేర్చి కొత్త క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు నినదిస్తున్నారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనల ఉల్లంఘన పేరిట నిరుద్యోగులపై ఎడాపెడా కేసులు పెడుతున్నారు.