మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలల ఆడియో టేప్ అంటూ సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వాయిస్ తనది కాదని, ఎవరో ఇమిటేట్ చేశారని, తమ గొంతును మిమిక్రీ చేశారని అవంతి క్లారిటీ ఇచ్చారు. అవంతి ఒక్కరే కాదు, గతంలో ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్న కమెడియన్ పృథ్వి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ఇదే తరహాలో తమ వాయిస్ లు మిమిక్రీ చేశారని ఆ ఆరోపణలను కొట్టిపారేశారు
ఈ నేపథ్యంలో అవంతిపై వచ్చిన ఆరోపణలు, దానికి అవంతి స్పందనపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సెటైర్లు వేశారు. వారి గొంతులను అనుకరించిన కళాకారులెవరో తక్షణమే తేల్చేందుకు విచారణ చేపట్టాలని, లేదంటే, తన స్వరం, సీఎం జగన్ స్వరం కూడా అనుకరిస్తారేమోనని ఆర్ఆర్ఆర్ ఎద్దేవా చేశారు. ఈ మిమిక్రీ ఆడియోల వెనుక కుట్ర దారులెవరో తేల్చాలని, దీనిపై సీఎం, డీజీపీ ఫోకస్ చేయాలని కోరారు.
గుంటూరులో రమ్య హత్యోదంతం కళ్లముందు మెదులుతుండగానే…రాజుపాలెంలో ఓ దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన, విజయనగరంలో యువతి మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటివి జరగకుండా చూడాలని సీఎంను కోరారు. ఇక, 20వ తేదీ వచ్చినా ఏపీలో 20 శాతం ఉద్యోగులకూ జీతాలు అందలేదని తనలో చాలామంది చెప్పారని, రూ.2.56 లక్షల కోట్ల అప్పులు చేసిందని గణాంకాలు చెబుతున్నాయని రఘురామ అన్నారు.
ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి అప్పులు తీసుకునే పరిస్థితి లేదని, దీంతో, జీతాలు, పెన్షన్ లు, అప్పులకు వడ్డీలు చెల్లించే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో సర్క్యూట్ హౌస్ వెనుక ఉన్న దసపల్లా భూములపై 22 (ఎ) సెక్షన్ ను ఎత్తివేసిన 24 గంటల్లోనే అవి రిజిస్ట్రేషన్ అయ్యాయని, పోలవరం కడుతున్న ఓ వ్యక్తికే ఆ భూములు కట్టబెట్టారని రఘురామ ఆరోపించారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి కలెక్టర్ గా రాగానే ఇది జరగడం ఏమిటో తనకు అర్థం కావడం లేదని చురకలంటించారు.