ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై టాలీవుడ్ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. హెరిటేజ్ ఫుడ్స్ తనదేనని, ఆ సంస్థలో తన డబ్బు, తన షేర్ ఎక్కువని, చంద్రబాబుది తక్కువని మోహన్ బాబు వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాదు, హెరిటేజ్ వాటాల విషయంలో చంద్రబాబు తనను మోసం చేశాడని వైఎస్సార్ కు కూడా గతంలో వెల్లడించినట్లు మోహన్ బాబు చెప్పడం కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో అసలు మోహన్ బాబు చెబుతున్న దాంట్లో వాస్తవం ఎంత? అసలు హెరిటేజ్ లో ఎవరి వాటా ఎంత? అన్న విషయాలపై చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే మోహన్ బాబు గుట్టురట్టు చేసే సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
1992లో ఒక కోటి 80 లక్షల రూపాయలతో హెరిటేజ్ సంస్థను స్థాపించారు. అందులో మోహన్ బాబు రూ.23.50 లక్షల పెట్టుబడి పెట్టగా ఆయనకు 12 శాతం వాటా దక్కింది.
కంపెనీ స్థాపించిన తర్వాత చాలాసార్లు విస్తరణ జరిగింది. ఈ క్రమంలో మిగతా పెట్టుబడిదారులు అనేకమార్లు పెట్టుబడి పెట్టారు. కానీ, కొత్తగా మోహన్ బాబు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు.
1994లో రాజకీయ కారణాల నేపథ్యంలో హెరిటేజ్ కు బాబు రాజీనామా చేయగా…ఆ తర్వాత అదే కారణంతో మోహన్ కూడా రాజీనామా చేశారు. 1995లో మోహన్ బాబు రాజ్యసభకు వెళ్లారు. ఆ తర్వాత కూడా అనేక మార్లు హెరిటేజ్ విస్తరణ జరిగింది.
ఈ క్రమంలోనే 1999 నాటికి మోహన్ బాబు పెట్టిన రూ.23.50 లక్షల పెట్టుబడి నాలుగు రెట్లు పెరిగి రూ.81 లక్షలు కాగా, వాటా 2.19 శాతం అయింది. ఆ తర్వాత చంద్రబాబుతో మోహన్ బాబుకు విభేదాలు రావడంతో తాను తొలుత పెట్టిన 12 శాతం వాటా 1999లోనూ కావాలని కోర్టుకు వెళ్లారు.
అయితే, పెట్టుబడి పెట్టకుండా వాటా పెరగదు కదా అని కోర్టు ప్రశ్నించడంతో కేసు విత్ డ్రా చేసుకున్నారు. నిజంగా మోహన్ బాబుకు నిజాయితీ ఉంటే పెట్టిన కేసు విత్ డ్రా చేసుకునే వారు కాదు కదా. ఇది, మోహన్ బాబు కామెంట్ల వెనుక ఉన్న అసలు వాస్తవాలు.
కమ్మ వర్గ నేతలను వాడి చంద్రబాబుపై ఆరోపణలు చేయించి తెలుగుదేశం పార్టీని బదనాం చేయడానికి వేసిన పన్నాగం ఇది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లేకపోతే వైఎస్ ఆరోజు మోహన్ బాబుతో ఏమన్నాడు చెప్పడానికి ఇపుడు వైఎస్ లేడు. వైఎస్ కు చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థే గాని ఇద్దరు బాగానే ఉన్నారు.
లేని వైఎస్ మీద నిందలు వేసి, ఇపుడు సమయం సందర్భం లేకుండా ఆరోపణలు చేయడం వెనుక వైసీపీ ఉందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. అయినా మోహన్ చెబుతున్నది రాజకీయ వివాదం కాదు, క్యాపిటల్ వివాదం. దీనిని పరిష్కారం కావాలంటే కోర్టుకు వెళితే సరిపోతుంది. కానీ కోర్టులో తేల్చుకోకుండా రాజకీయ విమర్శలు చేస్తున్నాడంటే దీని వెనుక ఉద్దేశం, ఎవరు ఉన్నదీ తెలిసిపోతుంది.