తెలంగాణలో తన పొలిటికల్ ఎంట్రీతో అందరిని సర్ ప్రైజ్ చేయటమే కాదు.. ఊహించని షాకిచ్చిన వైఎస్ షర్మిలకు తాజాగా అనూహ్య రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. రెండో శ్రావణ శుక్రవారం వేళ.. ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండే ఇందిరా శోభన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా లేఖ పంపి.. బిగ్ షాకిచ్చారని చెప్పాలి. షర్మిల పార్టీకి తానురాజీనామా చేస్తున్నట్లుగా ఈ రోజు (శుక్రవారం) ఉదయం ఆమె ఒక లేఖను విడుదల చేశారు. దాన్ని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పంపారు.
తన రాజీనామా లేఖలో తాను పార్టీకి ఎందుకు రాజీనామా చేసింది? దాని వెనుకున్న కారణంతో పాటు.. భవిష్యత్ కార్యాచరణ మీద కూడా క్లారిటీ ఇచ్చారు. పార్టీకి కీలక నేతగా.. షర్మిల వెంట ఉండే సన్నిహితురాలిగా పేరున్న ఆమె పార్టీని వీడటం ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది. వాస్తవానికి పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగినా.. ఆమె కంటిన్యూ అయ్యారు. తాజాగా మాత్రం ఆమె షర్మిల పార్టీకి రిజైన్ చేసిన వైనం సంచలనంగా మారింది.
ఇందిరా శోభన్ విడుదల చేసిన లేఖలో ఏం ఉందంటే..?
– నా శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు నమస్కారం.. నన్ను ఆదరిస్తూ, అభిమానిస్తూ ప్రజాజీవితంలో ముందుకు నడిపిస్తున్న తెలంగాణ ప్రజలకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. తెలంగాణ ఉద్యమంలో రాష్ర్ట సాధన కోసం కలిసి కోట్లాడినం. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలని కలలుగన్నం. వాటిని సాకారం చేసుకునేందుకు ప్రజలతో మమేకమైన నన్ను.. మీరంతా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాం.
– ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను. అది మీరు కోరుకుంటున్నట్లుగానే షర్మిలక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశాను. రాజీనామాకు కారణం ఏంటంటే.. అమరవీరుల ఆశయాల సాధన కోసం, అన్నదాతల జీవితాల్లో ఆనందం కోసం, యువతకు, నిరుద్యోగులకు న్యాయం కోసం, దళిత, బహుజనుల, సబ్బండ వర్గాల సాధికారత కోసం, మైనార్టీల బతుకు బాగుకోసం, గిరిజనుల జీవితాల్లో వెలుగుల కోసం, మహిళలకు సమాన వాటా కోసం, కొట్లాడుతూనే ఉన్నాను.
– నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడుతూనే ఉంటా. అందుకు షర్మిలక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉండకూడదని.. అభిమానులు, శ్రేయోభిలాషులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు నేను ఈ పార్టీకీ రాజీనామా చేశాను. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాను. ప్రజాజీవితంలోనే ఉంటా.
– జనం కోసమే కదులుతా. ప్రజల కోసమే అడుగులు వేస్తా. ఇదే ఆదరాభిమానాలను ఇక ముందు కూడా మీ నుంచి నాకు ఉంటాయని, నన్ను నడిపిస్తారని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను. ఇన్నాళ్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో నాకు సహకరించిన ప్రతీ నాయకుడికి, కార్యకర్తలకు పేరు పేరునా ధన్యవాదాలు.