కరోనా దెబ్బకు అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఫస్ట్, సెకండ్ వేవ్ లలో విధించిన లాక్ డౌన్ వల్ల చాలామంది ప్రైవేట్ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు, దినసరి కూలీలు రోడ్డునపడ్డారు. వీరందరిలోకెల్లా ప్రైవేటు స్కూళ్లలో అరకొర జీతాలకు పనిచేస్తున్న ప్రైవేటు టీచర్లు ఆర్థికంగా చితికిపోయారు. అందిన కాడికి అప్పులు చేసి కొందరు ఎలాగోలా బతుకు బండి నెట్టుకొచ్చారు. మరికొందరు అహాన్ని చంపుకొని మరి దొరికిన పని చేసుకొని కాలం వెళ్లదీశారు.
జీవనోపాధి పోవడంతో కరోనా సమయంలో ప్రాణభయం వెంటాడుతున్నప్పటికీ…పొట్టకూటి కోసం రోడ్లమీద తోపుడు బండ్లు పెట్టుకొని కూరగాయలు, పండ్లు అమ్మిన ఉపాధ్యాయుల కథలు పలువురిని కంటతడి పెట్టించాయి. అయినప్పటికీ, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకుల కష్టాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. వారిని తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలంటూ సీఎం జగన్ కు లోకేష్ లేఖ రాశారు.
ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని లేఖలో లోకేష్ పేర్కొన్నారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లు మిగిల్చిన నష్టం కారణంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు పునః ప్రారంభం అయిన రోజే కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో ప్రైవేట్ పాఠశాల నడుపుతున్న దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందని అన్నారు.
గడిచిన 5 నెలల్లో, పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో పనిచేసే దాదాపు 5 లక్షల మంది బోధన మరియు బోధనేతర సిబ్బంది ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని లేఖలో పేర్కొన్నారు. జీతాలు రాక ఉపాధ్యాయులు కూరగాయలు విక్రయించడం, భవన నిర్మాణ కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా మారడం వంటి విషాద గాధలు ఎన్నో చూశామని జగన్ దృష్టికి తీసుకువచ్చారు.
ఆర్థికంగా చితికిపోయిన ప్రైవేటు ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం నెలకి 2 వేల రూపాయల ఆర్థిక సాయంతోపాటు 25 కిలోల బియ్యం అందించిందని, కర్ణాటక ప్రభుత్వం నెలకు 5 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించిందని గుర్తు చేశారు. ఆ ప్రభుత్వాల తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవనోపాధికి తగిన భద్రత ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.