ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి, దివంగత నే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కీలక పురోగతి సాధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన అనుమానితుడు సునీల్ యాదవ్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరిపిన సీబీఐ అధికారులు పలు కీలక విషయాలు రాబట్టారు. సునీల్ ఇచ్చిన సమాచారంతో సీఎం జగన్‌కు సమీప బంధువు, వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డిని ఇటీవల సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
ఇక, ఈ కేసులో తొలుత నుంచి కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పేరు వినిపిస్తున్న క్రమంలో అవినాశ్‌రెడ్డి తండ్రి, వైసీపీ పులివెందుల ఇన్చార్జి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ ఇప్పటికే ఒకసారి విచారణ జరిపింది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి భాస్కర్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు వైఎస్ మనోహర్‌రెడ్డిని కూడా సీబిఐ బృందం విచారణ జరిపింది. ఇదే సమయంలో కడపలో సీబీఐ అధికారులను వివేకా కుమార్తె సునీత కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
హైకోర్టుకు, ఢిల్లీలో సీబీఐ అధికారులకు తన తండ్రి హత్య కేసులోని 15 మంది అనుమానితుల జాబితాను సునీత ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో ప్రధానంగా వైఎస్ భాస్కర్‌రెడ్డి పేరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భాస్కరరెడ్డితో పాటు మనోహర్‌రెడ్డిలను సీబీఐ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా విచారణ జరిపినట్లు తెలుస్తోంది. భాస్కర రెడ్డి, మనోహర్ రెడ్డిలు సీఎం జగన్‌కు చిన్నాన్నలు అవుతారన్న సంగతి తెలిసిందే.
అంతకుముందు, కొద్ది రోజుల క్రితం అభిషేక్ రెడ్డిని విచారణ జరిపిన రోజే సీబీఐ అధికారులతో సునీత భేటీ కావడం చర్చనీయాంశమైంది. కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో సీబీఐ అధికారులను వైఎస్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కలిసి గంట పాటు మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కేసుకు సంబంధించిన పురోగతిపై వారిద్దరూ ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు, తాను పిటిషన్ లో పేర్కొన్న పేర్ల విచారణ పై కూడా సునీత అడిగినట్లు తెలుస్తోంది.