అఫ్ఘాన్ లో తాలిబన్లు పాగా వేయడంతో పౌరులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వానికి, అమెరికా సైన్యానికి సహకరించిన వారి వివరాలు తాలిబన్లు సేకరిస్తున్నారనే వార్తలు రావడంతో ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. కాబూల్ ను వశపరుచుకున్న తాలిబన్లు…ఇళ్లను జల్లెడపట్టి ప్రజల వద్ద నుంచి కార్లు లాక్కుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.
దీంతో, దేశం విడిచి వెళ్లేందుకు ఎయిర్పోర్ట్కు వేలాదిమంది ప్రజలు తరలివస్తున్నారు. వీసా, పాస్ పోర్టు తనిఖీ చేసే సమయం కూడా ఇవ్వకుండా, రన్ వేపై విమానం కనిపించగానే దాని వైపు పరుగులు పెడుతున్నారు. విమానం ఏ దేశానికి వెళుతుందో కూడా తెలుసుకోకుండా, విమానం ఎక్కి దేశం దాటితే చాలు దేవుడా అనుకునే పరిస్థితికి అక్కడి ప్రజలు వచ్చారు. ఎయిర్ పోర్టులో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో ప్రయాణికులను అడ్డుకునేందుకు అమెరికా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయం పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలను నిలిపివేశారు. మరోవైపు, కాబూల్ లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. కీలక పత్రాలు, భారత రాయబారితోపాటు ఎంబసీ సిబ్బందిని భారత్ కు తరలించేందుకు చర్యలు ప్రారంభించారు. వాయుసేనకు చెందిన సి-17 విమానంలో వారిని భారత్ కు తీసుకువస్తున్నారు. అంతేకాదు, అఫ్ఘాన్ లోని భారత పౌరులను కూడా స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు, అఫ్ఘాన్ ప్రజలందరికి క్షమాబిక్ష పెట్టినట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు ఎవరి పనులు వారు చేసుకోవచ్చని, ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ఓ ప్రకటన విడుదలైంది. పూర్తి విశ్వాసం, భద్రతతో ప్రజలంతా జీవించొచ్చనని, ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు కూడా క్షమాభిక్ష పెట్టామని తాలిబన్లు ప్రకటించారు. ఎవరి ఇళ్లలోకి చొరబడొద్దని, ఆయుధాలు తీసుకొవద్దని, ప్రజల ఆస్తులు లాక్కోవద్దని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు.
తమకు శాంతియుతమైన అంతర్జాతీయ సంబంధాలు కావాలని తాలిబన్లు ప్రకటించారు. అయితే, రెండ్రోజుల క్రితం కొందరు తాలిబన్లు…ప్రభుత్వానికి సంబంధించిన 80 మందిని బందీలుగా చేసుకున్నారని వార్తలు రావడంతో చాలామంది ప్రజలు దేశం విడిచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు.