అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్ల వశమైపోయింది. ఆ దేశ అధ్యక్షుడు చల్లగా ఉజ్బెకిస్తాన్‌కి జారుకోవడంతో ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే దేశం తాలిబాన్ల చేతికి అందింది.
ఒక ప్రభుత్వంతో.. అమెరికా, బ్రిటన్ వంటి అగ్ర దేశాల సేనలతో 20 ఏళ్లకు పైగా పోరాడి.. వారు వెళ్లిపోగానే రోజుల వ్యవధిలోనే దేశమంతటినీ తమ ఆధీనంలోకి తెచ్చుకునేటంతటి శక్తి తాలిబాన్లకు ఎలా వచ్చింది?
అగ్రదేశాలతో తలపడేందుకు తగినంత ఆర్థిక సత్తా వారికెక్కడిది.. తాలిబాన్ల వద్ద ఉన్న డబ్బు ఎంత? వారికి నిధులు ఎలా వస్తున్నాయి.. ఏఏ దేశాలు వారికి సహకరిస్తున్నాయన్నది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ఆఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు ఇంతకుముందు 1996 నుంచి 2001 వరకు పరిపాలించారు.
2011 నుంచి 2019 వరకు తాలిబాన్ల వార్షికాదాయం సుమారు రూ.2,800 కోట్లు. కానీ ఇప్పుడు వారి వార్షిక ఆదాయం లక్ష కోట్ల రూపాయలు దాటిపోయిందని అంచనా వేస్తున్నారు.
అఫ్గానిస్తాన్, అమెరికా ప్రభుత్వాలు తాలిబాన్ల నెట్‌వర్క్‌ను నియంత్రించడానికి ప్రయత్నించాయి. 2018వ సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం తాలిబాన్లకు చెందిన డ్రగ్ లేబరేటరీలపై బాంబు దాడులు చేయడానికి ఒక వ్యూహం రచించింది.
2012లో ఐక్యరాజ్య సమితి తాలిబాన్ల ప్రధాన ఆదాయం నల్లమందు ద్వారానే వస్తున్నట్లు గుర్తించింది. అయితే, ఇప్పుడు తాలిబాన్లకు ఆదాయం కేవలం మాదక ద్రవ్యాల వ్యాపారం నుంచి మాత్రమే లభించడం లేదు.
అఫ్గానిస్తాన్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా నల్లమందును ఉత్పత్తి చేస్తున్న దేశం. ఆ దేశం ఏటా సుమారు 2 లక్షల కోట్ల రూపాయల నల్లమందు ఎగుమతి చేస్తోందని భావిస్తున్నారు.
తాలిబాన్ల ఆధీనంలోని ప్రాంతాలలో నల్లమందును ఎక్కువగా పండిస్తారు. పండించిన దగ్గర నుంచి ఎగుమతి అయ్యేవరకు రకారకాల రూపంలో తాలిబాన్లు పన్నులు విధిస్తారు.
నల్లమందును పండించే రైతుల నుంచే మొదట 10 శాతం పన్ను వసులు చేస్తున్నారు. ఆ తర్వాత ఓపియమ్‌ను నల్లమందుగా మార్చే లేబరేటరీల నుంచి, వాటిని డ్రగ్ రూపంలో స్మగ్లింగ్ చేసే వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు.
మాదక ద్రవ్యాల నుంచి తాలిబాన్లకు సుమారు రూ.700-2800 కోట్ల వరకు వార్షికాదాయం లభిస్తోందని భావిస్తున్నారు.
అయితే తాలిబాన్లు మాత్రం నార్కోటిక్స్‌తో తమకు ఏ మాత్రం సంబంధం లేదని.. తాము పాలనలో ఉండగా, 2000 నుంచే దాని పెంపకంపై నిషేధం విధించినట్లు చెబుతున్నారు.
అఫ్గానిస్తాన్‌లో తిరుగుబాటుదారులపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా గతంలో ట్రంప్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. వాటిలో భాగంగా తాలిబాన్ల ఆర్థిక నెట్వర్క్, ఆదాయ వనరులను లక్ష్యంగా చేసుకుంది.
తాలిబాన్ల ఆదాయంలో సుమారు 60 శాతం మాదకద్రవ్యాల ద్వారానే వస్తుంది.
నల్లమందు వ్యాపారమే కాకుండా తాలిబాన్లు ఇతర వాటిపైనా పన్నులు వేస్తారు. తాలిబాన్ ఆర్థిక కమిషన్ తమ ఆధీనంలోని ప్రాంతాలలో సరుకు రవాణా చేసేటప్పుడు తమకు పన్నులు చెల్లించాలని హెచ్చరించింది.
అంతే కాకుండా తాలిబాన్లు టెలికమ్యూనికేషన్స్, మొబైల్ ఫోన్ ఆపరేటర్ల నుంచీ బలవంతపు వసూళ్లు చేస్తారు.
దేశంలోని వివిధ ప్రాంతాలలో తాలిబాన్లు 2019 ప్రారంభంలో విద్యుత్ వినియోగదారుల నుంచి సుమారు రూ.14 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అఫ్గానిస్తాన్ విద్యుత్ సంస్థ వెల్లడించింది.
ఖనిజాలు, విలువైన రాళ్లపరంగా అఫ్గానిస్తాన్ సుసంపన్నమైనది. దేశంలోని మైనింగ్ పరిశ్రమ వార్షిక విలువ సుమారు రూ.7 వేల కోట్లు. అయితే ఈ మైనింగ్ ఎక్కువభాగం అక్రమంగానే జరుగుతోంది. ఖనిజ ప్రాంతాలను ఆక్రమించుకున్న తాలిబాన్లు అక్కడ జరిగే మైనింగ్ కార్యకలాపాల ద్వారా భారీ ఎత్తున బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు.
2014లో ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి తాలిబాన్లు దక్షిణ హెల్మండ్ ప్రాంతంలోనే ఏటా సుమారు రూ.70 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. మైనింగ్‌పై ఏడాదికి వారికి వెయ్యి కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా.
పాకిస్తాన్, ఇరాన్, రష్యా ప్రభుత్వాలు కూడా తాలిబాన్లకు ఆర్థిక సాయం చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
చైనా నుంచీ వారికి రహస్యంగా నిధులు అందుతున్నాయన్న ఆరోపణలున్నాయి.
గల్ఫ్ దేశాల నుంచి తాలిబాన్లు రూ.740 కోట్లు అందుకున్నట్లు 2008లో సీఐఏ నివేదిక వెల్లడించింది.