ఏపీకి మరో ప్రతిష్టాత్మక పెట్టుబడి రానుంది. ఇది.. భారత ప్రభుత్వ రంగ సంస్థే కావడం గమనార్హం. రాష్ట్రంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. వీటిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా.. క్యూ కడుతున్నాయి. తాజాగా.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయించింది.
ఈ క్రమంలో ఏకంగా.. రూ.95 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అయితే.. ఈ మొత్తాన్ని నాలుగు దశల్లో పెట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది. దేశంలో ఇప్పటికే మూడు రిఫైనరీలను ఏర్పాటు చేసిన బీపీసీఎల్ నాలుగోది ఏపీలో ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో తొలి దశ కింద 6 వేల కోట్ల రూపాయలను పెట్టేందు కు ముందస్తు కార్యకలాపాలు చేపట్టడానికి సంస్థ పాలకమండలి ఆమోదముద్ర వేసింది. తద్వారా.. రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక సంస్థపెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమం అయింది.
ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బీపీసీఎల్ పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిసింది. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనంతపురంలో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పడ నున్న నేపథ్యంలో దాదాపు ఆ జిల్లాలోనే ఈ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉండనుంది. పెట్రోలియం యూనివర్సిటీ రిసెర్చ్లు సహా.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పడేందుకు.. ఈ సంస్థ ఏర్పాటు దోహద పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.