ఆస్కార్ అవార్డ్…మొఖానికి రంగు వేసుకున్న ప్రతి ఒక్క నటుడి చిరకాల కోరిక. 24 క్రాఫ్ట్ర్స్ లో పనిచేసే ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని కలలు కంటుంటారు. రంగుల ప్రపంచంలో తమ రంగుల కల నెరవేరాలని ఆకాంక్షిస్తుంటారు. ఇలా ప్రతిష్టాత్మకంగా భావించే 93వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. కానీ, కరోనా నేపథ్యంలో కేవలం సెలబ్రెటీలతో మాత్రమే ఈ వేడుకలు నిర్వహించారు.
హాలీవుడ్ దర్శకురాలు క్లోయీ జా దర్శకత్వం వహించిన ‘నోమాడ్ల్యాండ్’ ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రానికి గాను క్లోయీ జా ఉత్తమ దర్శకురాలిగా ఎంపికై రికార్డు క్రియేట్ చేశారు. ఉత్తమ దర్శకురాలిగా అవార్డు గెల్చుకుని ఆ ఘనత సొంతం చేసుకున్న తెల్లజాతికి చెందని తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. చైనాలో పుట్టి బ్రిటన్ లో పెరిగిన క్లోయీ జా..అమెరికాలో ప్రముఖ దర్శకురాలిగా స్థిరపడ్డారు. మొత్తంగా, బెస్ట్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు అందుకున్న రెండవ మహిళగా క్లోయా జా చరిత్ర పుటలకెక్కారు.
ఇక, ‘నోమాడ్ల్యాండ్’ చిత్రానికిగాను ఉత్తమనటిగా ఫ్రాన్సెన్ మెక్డోర్మాండ్ ఆస్కార్ అవార్డు గెల్చుకుంది. ‘ది ఫాదర్’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా ఆంథొని హాప్కిన్స్ ను ఆస్కార్ వరించింది. అడాప్టెడ్ స్క్రీన్ప్లే విభాగంలో ‘ది ఫాదర్’ చిత్రానికి అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఎమరాల్డ్ ఫెన్నెల్కు ఆస్కార్ వరించింది. ఇక ఉత్తమ రచయితగా క్రిస్ట్ ఫర్ హ్యాంప్టన్, ఫ్లోరియన్ జెల్లర్ లకు, ఉత్తమ సహాయ నటుడిగా డానియల్ కలూయలు ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. అలాగే ఉత్తమ సహాయ నటిగా యువాన్ యు జంగ్ (మీనారి సినిమా)కు అవార్డు అందింది. దక్షిణ కొరియాలోనే ఆస్కార్ అందుకున్న తొలి నటిగా ఆమె రికార్డులకెక్కింది.
93వ ఆస్కార్ అవార్డుల పూర్తి జాబితా ఇదే
ఉత్తమ చిత్రం: నోమాడ్ల్యాండ్
ఉత్తమ నటి: ఫ్రాన్సెన్ మెక్డోర్మాండ్ (నోమాడ్ల్యాండ్)
ఉత్తమ నటుడు: ఆంథొని హాప్కిన్స్ (ది ఫాదర్)
ఉత్తమ సహాయ నటి: యూ-జంగ్ యోన్ (మినారి)
ఉత్తమ సహాయ నటుడు: డానియెల్ కలూయా (జూడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయ్య)
ఉత్తమ డైరెక్టర్: క్లోయీ జా (నోమాడ్ల్యాండ్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: ఎమరాల్డ్ ఫెన్నెల్ (ప్రామిసింగ్ యంగ్ వుమన్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: క్రిస్టోఫర్ హ్యాంప్టన్, ఫ్లోరియన్ జెల్లర్ (ది ఫాదర్)
ఉత్తమ యానిమేషన్ చిత్రం: సోల్
ఉత్తమ డాక్యుమెంటరీ: పిప్పా ఎర్లిచ్, జేమ్స్ రీడ్, క్రెయిగ్ ఫోస్టర్ (మై ఆక్టోపస్ టీచర్)
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: అనదర్ రౌండ్ (డెన్మార్క్)
ఉత్తమ గీతం: ఫైట్ ఫర్ యూ – జూడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయ్య (హెచ్ఇఆర్, డెర్నెస్ట్ ఎమిలీ-2, టియారా థామస్)
ఉత్తమ సంగీతం: సోల్ (ట్రెంట్ రెజ్నర్, అటికస్ రాస్, జాన్ బాటిస్ట్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: మంక్ (ఎరిక్ మెసర్షిమిట్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: టెనెట్ (ఆండ్రూయ జాక్సన్, డేవిడ్ లీ, ఆండ్ర్యూ లాక్లీ, స్కాట్ ఫిషర్)
ఉత్తమ ఎడిటింగ్: సౌండ్ ఆఫ్ మెటల్ (మికెల్ ఇ.జి. నీల్సన్)