తెలంగాణ రాష్ట్ర అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్యే ఒకరిని ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించటంతో పాటు.. నాన్ స్టాప్ గా తొమ్మిది గంటల పాటు విచారించారన్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇంతకూ ఆయన్ను ఏ కేసులో విచారణ జరిపారు? ఎలాంటి ప్రశ్నల్ని సంధించారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇబహాంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సుపరిచితులైన మంచిరెడ్డి కిషన్ రెడ్డి తాజాగా ఈడీ విచారణకు హాజరైన ఉదంతం షాకింగ్ గామారింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయంలో మంచిరెడ్డి విచారణను ఎదుర్కొన్నారు. మనీలాండరింగ్.. ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా సమాచారం అందింది. దీంతో ఆయన్ను విచారణకు పిలిచినట్లుగా చెబుతున్నారు.
ఈ మధ్యన అక్రమ క్యాసినోల ఎపిసోడ్ లో మోత మోగిన పేరు ప్రవీణ్ చికోటి. అయితే.. ప్రవీణ్ తో గులాబీ ఎమ్మెల్యే మంచిరెడ్డికి ఉన్న లింకు ఏమిటి? అన్న దానిపై పెద్ద ఎత్తున విచారణ సాగుతోంది. క్యాసినో ఎపిసోడ్ లో చికోటిని ఈడీ అధికారులు ప్రశ్నించిన వైనం తెలిసిందే. చికోటీని ప్రశ్నించిన వేళ.. అతగాడితో సంబంధం ఉందని భావిస్తున్న మంత్రులు.. ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్యేల్ని కూడా విచారించాలని ఈడీ భావించినట్లుగా చెబుతున్నారు.
ఇందులో భాగంగానే గులాబీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కూడా విచారించినట్లుగా తెలుస్తోంది. 2015 నుంచి చికోటీతో సన్నిహిత సంబంధాలు ఉన్న మంచిరెడ్డి.. 2015-16లో ఇండోనేషియాలో పెట్టుబడులు పెట్టించేందుకు చీకోటి సాయం తీసుకున్నట్లు చెబుతారు. ఆ సందర్భంలో భారీగా డబ్బును హవాలా రూపంలో ఆ దేశానికి తరలించినట్లుగా చెబుతున్నారు.
అధికారుల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇండోనేషియాలోని బాలి.. నేపాల్.. గోవాలోని క్యాసినోలలో మంచిరెడ్డి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈడీ తాజాగా ప్రశ్నల వర్షాన్ని కురిపించినట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఒక మంత్రికి.. మరో ఇద్దరు గులాబీ ఎమ్మెల్యేలు సైతం ఈ విచారణకు హజరు కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. రెండో రోజుకూడా ఈడీ ముందుకు మంచిరెడ్డి హాజరవుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.