షాకింగ్ లెక్క ఒకటి బయటకు వచ్చింది. కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో భారీ సంఖ్యలో రోగులు మిస్అయినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఒకసారి ఆసుపత్రిలో ఆడ్మిట్ అయ్యాక.. వారిని డిశ్చార్జి చేసేందుకు ఒక క్రమ పద్దతిని అనుసరిస్తుంటారు. అందుకు భిన్నంగా లెక్కలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
హైదరాబాద్ లోని కింగ్ కోఠి జిల్లా ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులు ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ దారిన తాము వెళ్లిపోతున్నారు.
అలాంటి వారిని కట్టడి చేసే విషయంలో కింగ్ కోఠి ఆసుపత్రి ఫెయిల్ అవుతుందన్న మాట వినిపిస్తోంది. ఆసుపత్రిలోచికిత్స పొందుతూ.. ఆ తర్వాత కనిపించకుండా పోయిన రోగుల సంఖ్య 88 వరకు ఉన్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఏప్రిల్ ఒకటి నుంచి మే 18 వరకు కింగ్ కోఠిలో టెస్టుల కోసం వచ్చి.. ఆసుపత్రిలో ఆడ్మిట్ అయిన వారు 1802 మంది. అందులో 782 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 261 మంది మరణించారు. 671 మందిలో కొందరు ఇదే ఆసుపత్రిలోచికిత్స పొందుతుంటే.. మరికొందరిని గాంధీకి.. ఇతర ఆసుపత్రులకు తరలించారు.
అయితే.. 88 మంది చికిత్స పూర్తి కాకుండానే కనిపించకుండా పోవటం షాకింగ్ గా మారింది. ఇదెలా సాధ్యమన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. కొందరు రోగులు కింగ్ కోఠి ఆసుపత్రిలో చేస్తున్న ట్రీట్ మెంట్ నచ్చటం లేదని.. ఎవరికి చెప్పకుండా తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోతున్నట్లుగా చెబుతున్నారు.
దీంతో.. వారి డిశ్చార్జి వివరాలు నమోదు కావటం లేదు. దీన్ని మిస్సింగ్ గా చూడకూడదని ఆసుపత్రి సూపరింటెండెంట్ చెబుతున్నారు. సాంకేతికంగా మిస్ అయిన విషయాన్ని.. కాదని చెప్పటంలో అర్థం లేదన్న విమర్శ వినిపిస్తోంది.