అభిమాని రేణుకా స్వామిని దారుణంగా కొట్టి హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ జూన్ నెలలో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దర్శన్ విచారణ ఖైదీగా బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అయితే జైల్లో కూడా దర్శన్ రాజభోగాలు అనుభవిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జైలు లోపల దర్శన్ కుర్చీలో కూర్చుని ఓ చేతిలో కాఫీ కప్, మరో చేతిలో సిగరేట్ పట్టుకుని చిల్ అవుతన్న ఫొటో ఒకటి ఆదివారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా దర్శన్ జైలు నుండి తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో జైల్లో దర్శన్ ఎంత విలాసవంతంగా ఉన్నాడో.. అతనికి జైలు అధికారులు ఏ రేంజ్ లో రాజభోగాలు కల్పిస్తున్నారో స్పష్టంగా అందరికీ అర్థమైంది. దర్శన్‌కు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తుండటంతో సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
డబ్బు, స్టార్డమ్ ఉంటే వారు ఏ తప్పు చేసినా పట్టించుకోరా అంటూ అందరూ మండిపడుతున్నారు. అయితే ఈ అంశంపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. దర్శన్ కు స్పెషల్ ఫెసిలిటీస్ కల్పించిందెవరు..? అధికారులు ఏం చేస్తున్నారు..? అనే కోణంలో విచారణకు ఆదేశించింది. ఖైదీలకు వీఐపీ సౌకర్యాలు అందించే వీలు లేకుండా చర్యలు చేపట్టింది. అలాగే ప్రాథమిక విచారణలో ఏడుగురు జైలు అధికారులు దర్శన్ కు రాచమర్యాదలు చేస్తున్నట్లు గుర్తించి.. వారిని సస్పెండ్ చేశామని హోంమంత్రి జి పరమేశ్వర వెల్లడించారు.