భూకంపాలకు కేరాఫ్ అడ్రస్ గా చిట్టి దేశం జపాన్ నిలుస్తుంది. చూసేందుకే చిన్నదే అయినా.. మహా గట్టి దేశమైన జపాన్ లో భూకంపాలు సర్వసాధారణం. మనకు అప్పడప్పుడు ఉరుములు.. మెరుపులు ఎంత సాధారణమో.. జపాన్ లో భూకంపాలు సర్వసాధారణం. రిక్టర్ స్కేల్ మీద 3 నుంచి 5 వరకు భూకంపాల్ని జపనీయులు లెక్కలోకి తీసుకోరు. ఓపక్క భూమి కంపిస్తున్నా.. తమ పని తాము చేసుకుంటూ పోతారు. అంతలా భూకంపాలకు అలవాటు పడటమే కాదు.. వాటిని అధిగమించేలా.. భూకంపం తీవ్రతకు జనజీవితం అస్తవ్యస్తం కాకుండా ఉండేందుకు వీలుగా అక్కడి ఏర్పాట్లు ఉంటాయి.
ఇంటి నిర్మాణం మొదలు.. పలు అంశాలు ఒక మోస్తరు నుంచి భారీ భూకంపాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా అక్కడి వ్యవస్థలు ఉంటాయి. అలాంటి జపాన్ లోనే షాకిచ్చే తీవ్రతతో భూకంపాలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి భూకంపమే ఒకటి చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. సముద్ర తీర ప్రాంతమైన పుకుషిమా.. మియాగి పరిసర ప్రాంతాల్లో భారీ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
జపాన్ సముద్రంలోని 60 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని ఆ దేశ వాతావరణ శాఖ గుర్తించింది. రిక్టర్ స్కేల్ మీద తీవ్రతను చూసినప్పుడు దీన్ని భారీ భూకంపంగా చెప్పాలి. అయితే.. ఈసారికి సునామీ ముప్పు ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా భూకంపం కారణంగా ఎనిమిదిన్నర లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లుగా చెబుతున్నారు.
తాజా భూకంపం నేపథ్యంలో తక్షణ సాయం అందించేందుకు వీలుగా జపాన్ ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయటంతో పాటు.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజా భూకంపం కారణంగా పలు ఇళ్లు పెచ్చులూడిన విజువల్స్ ను అక్కడి టీవీ చానళ్లు ప్రసారం చేస్తున్నాయి. ఈ భారీ భూకంపాన్ని జపాన్ కానీ తట్టుకుంది కానీ.. ఇదే మరే దేశంలో వచ్చి ఉంటే.. తీవ్రత అంచనాలకు మించి ఉండటమే కాదు.. కోలుకోవటానికి ఏళ్లకు ఏళ్లు పడుతుందన్న మాట వినిపిస్తోంది.