యూ.ఎస్.ఏ.లోని మేరీల్యాండ్ లో తెలుగుదేశం పార్టీ ఎన్.ఆర్.ఐ విభాగం ఆధ్వర్యంలో ఎన్.టి.ఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆరవ మహానాడు కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి జయరాం కోమటి గారు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ శాసన మండలి సభ్యులు వై.వి.బి రాజేంద్రప్రసాద్, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు గారు తదితరులు పాల్గొన్నారు.
శ్రీనాధ్ రావుల నేతృత్వంలో ఈ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఫోటో ఎగ్జిబిషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది. అనంతరం చిన్నారులు గేయాలతో అలరించారు.
ఈ సందర్భంగా టిడిపి ఎన్నారై కోఆర్డినేటర్ జయరాం మాట్లాడుతూ పాలకపక్ష వికృత చేష్టలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. వైసిపి దోపిడీ పాలన చూసి ప్రవాసాంధ్రులు పెట్టుబడి పెట్టడానికి వెనకాడుతున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తొలగించడం పట్ల తెలుగువారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తెలుగువాడి గుండె చప్పుడైన ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని డిమాండ్ చేసారు.
మాజీ శాసన మండలి సభ్యులు వైవిబి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డికి వికేంద్రీకరణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవటమేమిటని ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతితో అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే సాక్షాత్తు మంత్రులే ఆటంకాలు కల్పించడం కోర్టు ధిక్కరణ అవుతుందన్నారు.
మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ఏపీలో చట్టబద్ధ పాలన లేదు. పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారన్నారు. ప్రశ్నించిన వారిని అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తున్నారన్నారు. విశాఖలో భూములు దోచుకున్న విజయసాయిరెడ్డిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.
వెంకట్ కూకట్ల, జానకి భోగినేని, మహేష్ నెలకుదిటి, శ్రీనివాసరావు దామా, శ్రీనివాసరం సామినేని, వాసు గోరంట్ల, శివ నెల్లూరి, హర్ష పేరంనేని, హరీష్ కూకట్ల తీర్మానాలు ప్రవేశ పెట్టారు.
కింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడమైంది.
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి
1. సామాజిక విప్లవ ఉద్యమ నిర్మాత, జాతి నిర్మాణం వైపు తెలుగు ప్రజలను జాగృతం చేసిన మహనీయుడు ఎన్టీఆర్. ఢిల్లీ బాదుషాల దగ్గర తాకట్టు పెట్టిన తెలుగువారి ఆత్మగౌరవానికి విముక్తి కల్పించిన మహనీయుడు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని నినదించిన వ్యక్తి ఎన్టీఆర్. జాతీయ రాజకీయాలను బాగా ప్రభావితం చేసిన ప్రాంతీయ పార్టీ నేత ఎన్టీఆర్. సరికొత్త తరాన్ని, వినూత్న సేవా సంస్కృతిని రాజకీయాల్లో ప్రవేశపెట్టిన భారత ప్రజాస్వామ్య దిక్సూచి ఎన్టీఆర్. ప్రతి సందర్భంలోనూ పరిణితిని ప్రదర్శించి తెలుగుజన హృదయ నేతగా జాతీయ నాయకుడిగా గుర్తింపబడ్డాడు. తెలుగువారికి ఇంతటి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఎన్టీఆర్ తెలుగుజాతి ఉన్నంతకాలం వారి మదిలో చిరస్మరణీయుడిగా ఉంటారు. శ్రీ నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ వేదిక ద్వారా తీర్మానించడమైంది.
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి
2. ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి తొలగించడం చారిత్రాత్మక తప్పిదం. వైద్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఉండాలని, ఉన్నతమైన వైద్య ప్రమాణాలు పెంచాలని 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ప్రారంభించారు. కాని ఎన్టీఆర్ తన పేరు పెట్టుకోలేదు. ఆయన మరణానంతరం పేరు పెట్టడం జరిగింది. జగన్ రెడ్డి పేర్లు, రంగుల పిచ్చి బాగా ముదిరింది. ఏదైనా కొత్త ప్రాజెక్టు నిర్మించి తన తండ్రి, తన పేరు పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం మార్పిడి జరుగుతుంది దానితో పాటు పేర్లు కూడా పూర్తిగా మారిపోతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ తెలుగు వారందరిని అవమానపరిచే విధంగా పేరు మార్చారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ పేరు మార్పును పున: పరిశీలించి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని ఈ మహానాడు వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం.
అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతం కావాలి
3. అమరావతి రైతుల పాదయాత్రకు అనూహ్య ప్రజా స్పందన కనిపిస్తున్నది. ప్రజాధరణ చూసి పాలకపక్షంలో అలజడి మొదలైంది. పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు సాయశక్తులు కృషి చేస్తున్నారు. దండయాత్ర, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒళ్లు బలిసి చేస్తున్న పాదయత్ర, కాళ్లు విరగ్గొడతామంటూ సాక్షాత్తు మంత్రులే… రైతులను, మహిళలను అవహేళన చేస్తున్నారు. పాదయత్ర చూసి ఎందుకు భయపడుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డిలు పాదయత్ర చేశారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎలాంటి ఆటంకాలు సృష్టించలేదు. తమ న్యాయమైన హక్కుల కోసం, న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని పాదయాత్ర చేస్తున్నా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. రక్షణ కల్పించాల్సిన కొందరు పోలీసులు అధికారపక్షానికి దాసోహమై పాదయాత్ర చేస్తున్న మహిళా రైతులపై దౌర్జన్యాలు పాల్పడుతున్నారు. వికేంద్రీకరణ ముసుగులో ఉత్తరాంధ్రను దోపిడీ చేయడానికి జగన్ రెడ్డి కుట్ర పన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతం కావాలని, హైకోర్టు తీర్పును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మహానాడు వేదిక ద్వారా తీర్మానిస్తున్నాం.
క్షీణిస్తున్న శాంతిభద్రతలు-ఆగని వేధింపులు- అక్రమ అరెస్ట్ లు
4. రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో నిర్బంధాలు, అక్రమ అరెస్ట్ లతో రాజ్యహింసకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే నెపంతో, ఇంకా అనేకమంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన పోలీసులు, వైసీపీ గూండాలు చేస్తున్నటువంటి దాడిని ఖండిస్తున్నాం. ప్రశ్నించిన వారిని అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలు, ప్రతిపక్ష నేతలపై వేధింపులు, అక్రమ కేసులను ఈ మహానాడు వేదిక ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం.
పోలవరం నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలి
5. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి తన అవినీతి, అక్రమ విధానాలతో కాంట్రాక్టర్లను మార్చడంతో పోలవరం నాశనం అయిందని హైదరాబాద్ ఐఐటి నివేదిక ద్వారా తేటతెల్లమైంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో కూడా ఏమాత్రం శ్రద్ద చూపలేదు. 2021 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని శాసనసభ సాక్షిగా చెప్పారు. తరువాత 2021 డిసెంబర్ నాటికన్నారు. మూడోసారి 2022 ఏప్రిల్ నాటికి పూర్తిచేస్తామన్నారు. కానీ ప్రస్తుతం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని ప్రస్తుత మంత్రి అంటున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో కాంట్రాక్ట్ సంస్థకు అపారమైన అనుభవం ఉండాలి. ప్రస్తుతం వున్న కాంట్రాక్ట్ సంస్థకు కానీ, సంబంధిత శాఖ మంత్రులకు కానీ అనుభవం లేకపోవటం, అనుభవం వున్న సీనియర్ ఇంజనీర్లను మూకుమ్మడిగా పంపివేయడం ఈ దుస్థితికి కారణం. కనీసం ఇంజనీర్లను మార్చకపోయినా, అవినీతికి పాల్పడకపోయినా ఎగువ, దిగువ కాపర్ డ్యాం లు, రాక్ ఫీల్ డ్యాం లు చాలావరకు పుర్తయ్యుండేవి. జగన్ రెడ్డి మూడున్నరేళ్లుగా జలవనరులు-నదుల అనుసంధానం పనులను పూర్తిగా నిలిపివేశారు. ముఖ్యమంత్రి చేతులెత్తేయడం వలన పోలవరం రాష్ట్రానికి శాశ్వతంగా దూరమైంది. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే తెలుగు ప్రజలకు జీవనాడి. పోలవరం నిర్మాణం తక్షణమే పూర్తిచేయాలని ఈ సమావేశం డిమాండ్ చేయడమైనది.
అన్నా క్యాంటీన్లు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య
6. అన్ని ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లు తెరవాలి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పేదల జీవన స్థితిగతులు తల్లక్రిందులయ్యాయి. ఉపాధి లేక, ఆదాయం లేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అలంటి పేదవారికి అండగా వుండి, వారి కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్లు భరోసా కల్పించాయి. అలాంటి అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదల పొట్ట కొట్టారు. తెలుగుదేశం పార్టీ పేదవాడి కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తే వాటిని అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం అన్నం పెట్టకపోగా కుప్పం, తెనాలి, మంగళగిరి, కడప, సత్తెనపల్లి ప్రాంతాల్లో టీడీపీ ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్లు అడ్డుకోవడం దుర్మార్గం. ఈ చర్యలను మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.
సభ్యత్వ నమోదు – పార్టీ సంస్థాగత నిర్మాణం
7. పార్టీని సంస్థాగతంగా బలంగా నిర్మించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్దఎత్తున చేపట్టడం జరిగింది. ఇందుకు ఎన్.ఆర్.ఐ టీడీపీ యూఎస్ విభాగం కూడా తమవంతు కర్తవ్యాన్ని సమర్థవంతంగా అమలుచేస్తోంది. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. ఇక్కడ నివసిస్తున్న వారిలో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ అభిమానులే. గతంలో వచ్చిన సభ్యత్వ నమోదుకంటే ఈ ఏడాది నమోదు మరింత పెంచేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ వేదిక ద్వారా తీర్మానించడమైంది.
ఈ కార్యక్రమంలో రవి మందలపు, శ్రీనివాస్ కూకుట్ల, సాయి బొల్లినేని, యాష్ బొద్దులూరి, తానా పూర్వ అధ్యక్షుడు సతీష్ వేమన, ప్రొఫెసర్ నరేన్ కొడాలి, భాను మాగులూరి, బోయపాటి వెంకటరమణ, డి.వి శేఖర్ తదితరులు ప్రసంగించారు.