తన మానాన తాను జిమ్ లోని మసాజ్ ఛైర్ లో కూర్చొని ఉన్న తెలంగాణ విద్యార్థి అమెరికాలో దారుణ హత్యకు గురి కావటం తెలిసిందే. ఈ ఉదంతం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులోని నిందితుడికి అమెరికా కోర్టు 60 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. హత్యకు గురైన వరుణ్ రాజ్ పుచ్చా.. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లారు.
గత అక్టోబరు 29న వాల్పరైసోలోని ప్లానెట్ ఫిట్ నెట్ సెంటర్ లో ఉన్న వరుణ్ రాజ్ పై అమెరికాకు చెందిన జోర్డాన్ ఆండ్రేడ్ కు 60 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ అమెరికాలోని ఇండియానా కోర్టు తీర్పును ఇచ్చింది. అమెరికాలోని వాల్పరైసో వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీని చదివేందుకు వెళ్లిన వరుణ్.. మరో రెండు నెలల్లో డిగ్రీ పూర్తి చేసుకోనునన సమయంలో దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే..నిందితుడికి మానసిక ఆరోగ్య పరిస్థితి బాగోలేదన్న మాట వినిపించింది.
వరుణ్ ది తెలంగాణలోని ఖమ్మం జిల్లా. అతడి తండ్రి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నారు. జిమ్ లో కత్తిపోట్లకు గురైన వరుణ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.అయినా ఫలితం లేకుండా పోయింది. 60 ఏళ్ల జైలు శిక్షకుగురైన జోర్డాన్ ఆండ్రేడ్ కు సంప్రదాయ జైలుశిక్షను అమలు చేస్తారా? లేదంటే మానసిక ఆరోగ్య సదుపాయంతో కూడిన శిక్షను అమలు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.