టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఇస్మార్ట్ శంకర్. 2019 జూలై 18న విడుదలైన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే నేటితో ఇస్మార్ట్ శంకర్ విడుదలై ఐదేళ్లు. ఈ సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
2015లో వచ్చిన టెంపర్ తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ మళ్లీ హిట్ ముఖం చూడలేకపోయారు. మూడేళ్లు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడిన అనంతరం పూరి ఇస్మార్ట్ శంకర్ కథ రాసుకున్నారు. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండను మొదట హీరోగా అనుకున్నారు. విజయ్ ను కలిసి పూరి కథ కూడా నెరేట్ చేశారు. కానీ ఈ డబుల్ దిమాక్ స్టోరీ విజయ్ కు పెద్దగా నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు.
అలా విజయ్ నుంచి చేజారిన ఇస్మార్ట్ శంకర్ స్టోరీ రామ్ చెంతకు చేరింది. ఆయనకు స్టోరీ నచ్చడంతో 2019 జనవరిలో సినిమాను స్టార్ట్ చేశారు. నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లగా ఎంపిక అయ్యారు. సత్యదేవ్ సెకండ్ హీరో పాత్రను పోషించారు. పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. మణి శర్మ సంగీతం అందించారు. కేవలం ఐదు నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఇస్మార్ట్ శంకర్ ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు థియేటర్స్ లో విడుదలైంది.
భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. స్టోరీ, రామ్ ఎనర్జిటిక్ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు, పూరి డైరెక్షన్, నభా-నిధి గ్లామర్, మణిశర్మ మ్యూజిక్ సినిమాను సూపర్ హిట్ గా మలిచాయి. రూ. 20 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఇస్మార్ట్ శంకర్ ఫుల్ రన్ లో రూ. 85 కోట్ల రేంజ్లో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ హిట్ మూవీకి సీక్వెల్ గా రామ్ తో పూరీ జగన్నాథ్ `డబుల్ ఇస్మార్ట్` ను తెరకెక్కించారు. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది.