కడపలో కాంగ్రెస్ నాయకులతో వైఎస్ షర్మిల నిర్వహించిన సమావేశం వైసీపీలో కలకలం పుట్టించింది.
షర్మిల కడప లోక్‌సభ స్థానానికి పోటీ చేయడం 100 శాతం ఖాయం అనే మాట ఆ లోక్‌సభ నియోజకవర్గంలో కార్చిచ్చులా వ్యాపించింది.
దీంతో షర్మిల పోటీ చేస్తే ఆ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.
కడప లోక్ సభ స్థానం పరిధిలోని కాంగ్రెస్ నేతలతో సమావేశమైన షర్మిల వారిని రెండు ప్రశ్నలకు సమాధానాలు అడిగారు.
కడప నుంచి తాను ఎందుకు పోటీ చేయాలో ఒక్క మాటలో చెప్పాలని కోరారు.
అలాగే, తాను ఎందుకు పోటీ చేయకూడదో కూడా చెప్పమని అడిగారు.
దీంతో ఆమె పోటీ చేసి తీరాల్సిందేనని కార్యకర్తలు, నాయకులు అందరూ చెప్పారు.
దీంతో షర్మిల కూడా అక్కడి నుంచి పోటీకి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
కాగా కడప పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు.
2019 ఎన్నికలతో పాటు 2014 ఎన్నికలలోనూ ఆయనే ఈ స్థానం నుంచి గెలిచారు.
అవినాశ్ రెడ్డి.. షర్మిల, జగన్‌లకు బాబాయి కుమారుడు.
అయితే, జగన్, షర్మిలల మరో బాబాయి, కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
గత ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్యలో అవినాశ్ రెడ్డి హస్తం ఉందని వివేకా కుమార్తె సునీత రెడ్డితో పాటు వైఎస్ షర్మిల రెడ్డి కూడా ఆరోపిస్తున్నారు.
అంతేకాదు.. ఇదంతా తెలిసినా సీఎం జగన్ కూడా అవినాశ్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారన్నది వీరు చేస్తున్న మరో ఆరోపణ.
ఈ నేపథ్యంలోనే షర్మిల కడపలో అవినాశ్ రెడ్డిపై పోటీ చేసి ఓడించాలని.. అవినాశ్ రెడ్డికి బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం కూడా షర్మిల కడపలో పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం.
మరోవైపు వైసీపీలో కూడా అవినాశ్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతేనే బెటర్ అనే ఉద్దేశం ఉన్నప్పటికీ జగన్ మాత్రం తన సోదరుడికి టికెట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
కడపలో షర్మిల పోటీ చేస్తే ఆమె విజయం సాధించగలరన్న అంచనాలు ఉన్నాయి.
కడప పార్లమెంటు స్థానంలో గత 10 ఎన్నికలుగా వైఎస్ కుటుంబీకులే గెలుస్తున్నారు.
1989లో ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు.
ఆ తరువాత వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్ నుంచి ఆయన ఇక్కడ ఎంపీగా గెలిచారు.
1989, 1991, 1996, 1998లో ఆయన వరుసగా నాలుగుసార్లు ఇక్కడ గెలిచారు.
ఆ తరువాత 1999లో రాజశేఖరరెడ్డి అసెంబ్లకి పోటీ చేయడంతో ఆయన తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి ఇక్కడ గెలిచారు. అనంతరం 2004లోనూ వైఎస్ వివేకానందరెడ్డే గెలిచారు.
అనంతరం 2009లో ఈ స్థానాన్ని ఆయన రాజశేఖర్ రెడ్డి కుమారుడు, ప్రస్తుత సీఎం జగన్ కోసం విడిచిపెట్టారు.
జగన్ 2009, 2011 ఎన్నికలలో ఇక్కడ నుంచి గెలిచారు.
అనంతరం 2014లో జగన్ పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయడంతో కడప లోక్ సభ స్థానాన్ని వైఎస్ అవినాశ్ రెడ్డికి కేటాయించారు.
ఆయన 2014, 2019లో ఇక్కడ నుంచి గెలిచారు.
ఇలా గత 10 ఎన్నికలలోనూ వైఎస్ కుటుంబీకులే ఇక్కడ గెలుస్తున్నారు.
ఒక్క 1996లో రాజశేఖర్ రెడ్డి 5 వేల స్వల్ప మెజారిటీతో బయటపడడం తప్ప మిగతా అన్నిసార్లూ భారీ మెజారిటీలతోనే గెలిచారు.
2011 ఉప ఎన్నికలలో అయితే జగన్ ఏకంగా అయిదున్నర లక్షల మెజారిటీతో గెలిచారు.
అలాంటి కడప పార్లమెంటు స్థానంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిల పోటీ చేస్తుండడం ఆమెకు కలిసొచ్చే అంశం.
ప్రధాన అయిదు అంశాలు పరిశీలిస్తే షర్మిల ఇక్కడ గెలవడం ఖాయమని అర్థమవుతోంది.
• కడపలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎంత పట్టుందో వైఎస్ వివేకానందరెడ్డికి కూడా అంతే పట్టుంది.
ఆయనకు భారీ అనుచర వర్గం ఉంది. ఆయన మరణం తరువాత వారంతా స్తబ్దుగా ఉన్నారు.
ఇప్పుడు వివేకా హంతకులను ఓడించాలంటూ షర్మిల అంటుండడంతో ఆమెకు మద్దతు లభిస్తోంది.
• వివేకా భార్యతో పాటు కుమార్తె సునీత రెడ్డి కూడా షర్మిలకే మద్దతు పలుకుతున్నారు.
• కడప స్టీల్ కోసం ఎంపీ అవినాశ్ రెడ్డి ఏమాత్రం ప్రయత్నించకపోవడం, ఆ విషయం షర్మిల హైలైట్ చేస్తుండడం ప్రజల్లో బాగా నానుతోంది.
• షర్మిల దూకుడు, పదునైన ప్రసంగాలు.. రాజకీయాల కంటే కుటుంబమే ముఖ్యం అంటూ వివేకా కుటుంబానికి అండగా ఉండడం స్థానికులను ఆకట్టుకుంది.
ముఖ్యంగా మహిళలు ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నారు.
• జగన్ ఏకఛత్రాధిపత్యానికి సవాల్ విసురుతూ షర్మిల తన ప్రసంగాలు, ప్రశ్నలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు..
కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు అంతా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
వీటన్నిటికీ మించి కడప పార్లమెంట్ ను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోగలిగితే సీఎం వైఎస్ జగన్ తో పాటు అవినాష్ రెడ్డికి కూడా చెక్ పెట్టిన వారం అవుతామనే ఆలోచనలో షర్మిల ఉండడం.. అందుకోసం విపరీతంగా కష్టపడుతుండడంతో ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని ప్రజలు అంటున్నారు.