అప్పు అన్ని సందర్భాల్లో తప్పు కాదు. ఈ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోవటానికి బదులుగా అపార్థమే ఎక్కువ చేసుకుంటారు. సరైన ప్లానింగ్ తో చేసే అప్పుతో నష్టం కంటే లాభమే ఎక్కువ. అందుకే అంటారు సరైన రీతిలో తీసుకునే రుణం ఎట్టి పరిస్థితుల్లో భారం కాదు. అందునా.. అప్పును పెట్టుబడిగా పెట్టినప్పుడు దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని సైతం పరిగణలోకి తీసుకోవాలి. పక్కా ప్రణాళికతో చేపట్టే కార్యక్రమాలతో రూపాయి పెడితే పది రూపాయిల లాభం అన్నట్లుగా ఉంటుంది.
అందునా మౌలిక వసతుల కల్పనలో భారీగా పెట్టుబడులు పెట్టటం ద్వారా మేలే జరుగుతుంది. సరైన రీతిలో తీసుకునే అప్పు ఒక వ్యక్తి విషయంలోనే కాదు.. ఒక సంస్థ.. ప్రభుత్వానికి సైతం లాభాన్నే మిగులుస్తుంది. కేంద్రం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచబ్యాంక్ సాయంతో రూ.15 వేల కోట్ల రుణాన్ని ఇవ్వనున్నట్లుగా ప్రకటించటమే కాదు.. ఏడాది వ్యవధిలో ఖర్చు చేయాలన్న పరిమితితో పాటు.. మరిన్ని నిధులు అవసరమైనా ఫర్లేదన్నట్లుగాచేసిన ప్రకటన అమరావతి రూపురేఖల్ని పూర్తిగా మార్చేసేందుకు సాయం చేస్తోంది.
అప్పు చేసి పప్పు కూడు అన్న సామెతను తెలుగువారు తరచూ ప్రస్తావిస్తుంటారు. అమరావతి విషయంలో ఈ సామెత ఏ మాత్రం వర్తించదు. దీనికి కారణం.. అమరావతి అన్నది ఏపీ ప్రజలకు అక్కరకు వచ్చేది. అదే సమయంలో తీసుకునే రుణంతో ఒరిగే లాభాలు బోలెడన్ని ఉన్నాయి. అందుకే అమరావతి కోసం చేసే అప్పు తప్పు కానే కాదు. అమరావతి నిర్మాణం కోసం తీసుకునే రుణం ఎట్టి పరిస్థితుల్లోనూ భారం కాదన్న విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. దీనికి ఐదు ప్రధాన కారణాల్ని చూపిస్తున్నారు. వాటిని అందరూ చూడాల్సిన అవసరం ఉంది.
అమరావతికి అప్పు తప్పు కాదన్నది ఎలానంటే..
1. రూ.15 వేల కోట్ల భారీ మొత్తాన్ని అమరావతికి రుణంగా అందించేది ప్రపంచ బ్యాంక్. మిగిలిన బ్యాంకులతో పోలిస్తే.. ప్రపంచ బ్యాంక్ రుణానికి తీసుకునే వడ్డీ చాలా తక్కువ.
2. ప్రపంచ బ్యాంక్ నుంచి అమరావతి నిర్మాణం కోసం తీసుకునే అప్పును తీర్చేందుకు దాదాపు 30 ఏళ్ల తర్వాతే చెల్లించాల్సి ఉంది. దీంతో.. తాజా అప్పు తీర్చేందుకు బోలెడంత సమయం ఉంది.
3. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ బడ్జెట్ లో కేంద్రం ప్రకటించిన రూ.15 వేల కోట్ల రుణంతో అయిపోదు. ఒక విధంగా చెప్పాలంటే మహా అప్పునకు మొదటి అడుగు పడిందని చెప్పాలి. కాకుంటే.. ఈ అప్పుతో చేసే పనులు అమరావతి ఇమేజ్ ను పెంచటమే కాదు.. రాష్ట్రం పెద్ద ఎత్తున డెవలప్ అయ్యేందుకు అవకాశాన్ని ఇవ్వనుంది.
4. మౌలిక వసతుల మీద చేసే ప్రతి రూపాయి ఖర్చుతో రెండు రూపాయిలు ప్రభుత్వానికి ఆదాయం రూపంలోనే వస్తుందన్నది మర్చిపోకూడదు. ఈ లెక్కన ఇప్పుడు ఖర్చు చేసే రూ.15 వేల కోట్లతో అమరావతి ముఖచిత్రం సమూలంగా మారనుంది. దీంతో మొదలయ్యే ఆర్థిక కార్యకలాపాలు అంతకంతకూ పెరగటమే తప్పించి తగ్గే వీల్లేదు. దీంతో.. సదరు రుణం భారం ఎంత మాత్రం కాదు.
5. అన్నింటికంటే ముఖ్యంగా ఒక విషయాన్ని ప్రస్తావించాలి. అమరావతికి బడ్జెట్ లో ప్రకటించిన రూ.15 వేల కోట్ల రుణానికి రాష్ట్ర ప్రభుత్వం హామీగా ఉండదు. సాధారణంగా రాష్ట్రాలు చేసే అప్పులు ఎఫ్ఆర్ బీఎం పరిధిలోకి వచ్చి.. మిగిలిన అవసరాలకు చేసే అప్పులకు అడ్డంకిగా మారుతుంది. తాజా రుణం మాత్రం అందుకు భిన్నం. ఎందుకంటే ఈ అప్పునకు కేంద్రమే హామీగా ఉంటుంది. దీంతో ఈ రుణం ఎఫ్ఆర్ బీఎం పరిధిలోకి రాదు కాబట్టి.. రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొత్తంగా అమరావతి మీద చేసే రుణం ఏపీకి ఎంత మాత్రం భారం కాదు.