కరోనా ఫస్ట్ వేవ్ తెలుసు. సెకండ్ వేవ్ ను ఇప్పుడు చూస్తున్నాం. మొదటి వేవ్ తో పోలిస్తే..రెండో వేవ్ తో ఎదురైన దారుణ అనుభవాల నేపథ్యంలో.. థర్డ్ వేవ్ అన్నంతనే వణికే పరిస్థితి. అలాంటిది ఏకంగా ఫోర్త్ వేవ్ అన్న మాటే షాకింగ్ గా మారింది.
ఇప్పుడు అలాంటి వేవ్ ఒకటి బుల్లి దేశం.. అత్యంత సంపన్న దేశమైన జపాన్ లో విరుచుకుపడుతుందని చెబుతున్నారు. కొవిడ్ ఫోర్త్ వేవ్ కారణంగా.. జపాన్ లోని అతి పెద్ద నగరాలైన టోక్యో.. ఒసాకాలతో పాటు మరికొన్ని నగరాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
చాలా నగరాల్లో హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆ దేశంలోని ఆసుపత్రుల్లో ఉన్న 96 శాతం బెడ్లు కరోనా రోగులతో నిండిపోయినట్లుగా చెబుతున్నారు. అనేక మంది తీవ్రమైన లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
జపాన్ లో ఇంతలా విరుచుకుపడుతున్న వేరియంట్ మూలాలు లండన్ వేరియంట్ అన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే..మరోవైపు రెండు నెలల్లో ఒలింపిక్స్ ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
12.5 కోట్ల మంది జనాభా ఉన్న జపాన్ లో ఇప్పటివరకు కేవలం అతి కొద్ది మందికే వ్యాక్సినేషన్ జరిగినట్లుగా చెబుతున్నారు. మరోవైపు ఫోర్త్ వేవ్ తో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్న వేళ.. ఒలింపిక్స్ ను నిర్వహించటం సాధ్యమా? అన్నది ప్రశ్నగా మారింది.
ఒకవేళ.. ఒలింపిక్స్ ను నిర్వహించలేకపోతే.. జపాన్ కు భారీ నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. ఓవైపు విరుచుకుపడుతున్న వైరస్.. మరోవైపు అంతంతమాత్రంగా సాగిన వ్యాక్సినేషన్ కార్యక్రమం.. ఇవి సరిపోవన్నట్లు ఒలింపిక్స్ నిర్వహణ ఇప్పుడా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తుందట.