ఏపీలో వ్యవసాయ రంగానికి బంగారు భవిష్యత్తు సాకారం కావడం ఖాయమనే దిశగా తాజాగా ప్రవేశ పెట్టిన వ్యవసాయ బడ్జెట్ చాటి చెప్పింది. 2024-25 మిగిలిన కాలానికి సంబంధించి తాజాగా కూటమి సర్కారు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశ పెట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. 43 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను కూర్చారు. దీనిలో ప్రధానంగా.. ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీ మేరకు.. రైతులకు ఇన్ పుట్ సబ్సీడీ నిధులను భారీగా కేటాయించారు.
అర్హులైన ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున ఇన్ పుట్ సబ్సిడీ(అన్నదాత సుఖీభవ)నని ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించారు. దీని ప్రకారం.. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి మెజారిటీ నిధులు రూ.4,500 కోట్లు కేటాయించడం గమనార్హం. సూపర్ సిక్స్ పథకాల్లో అన్నదాత సుఖీభవ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ పథకాల అమలుకు సర్కారు దాదాపు రెడీ అయిందన్న భావన వ్యక్తమవుతోంది. మరో కీలకమైన కేటాయింపు.. ప్రకృతి సాగు.
ఈ సాగును చంద్రబాబు ఎంతో ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా బడ్జెట్లో ప్రకృ తి వ్యవసాయానికి రూ.422.96 కోట్లు కేటాయించారు. దీనివల్ల సేంద్రియ పంటలకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంటల బీమాకు రూ.1,023 కోట్లు కేటాయించారు. తద్వారా అన్నదాత కష్టానికి.. ప్రకృతి విప త్తులు సృష్టించే నష్టానికి.. ప్రభుత్వం పూచీ పడేందుకు మరింత ఆస్కారం ఏర్పడింది.
రైతులకు మరో ముఖ్యమైన అంశం.. రాయితీ విత్తనాలు వీటికి కూడా.. రూ.240 కోట్లు కేటాయించారు. మొత్తంగా చూస్తే.. వ్యవసాయ బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకానికి జై కొడుతూనే.. సస్య శ్యామలంగా రాష్ట్రా న్ని పరుగులు పెట్టించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం.