అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఏ 14గా చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ లోకేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే లోకేష్ కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులిచ్చి విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. 41ఏ కింద లోకేష్‌కు నోటీసులు ఇస్తామన్న అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ ప్రకారం దర్యాప్తు అధికారి ఎఫ్ఐఆర్లో మార్పు చేశారని కోర్టుకు ఏజీ శ్రీరామ్ వెల్లడించారు.
41ఏ నిబంధనలు పూర్తిగా పాటిస్తామని, ఒకవేళ విచారణకు లోకేష్ సహకరించకుంటే కోర్టు దృష్టికి తెస్తామని వివరించారు. కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతే లోకేష్ ను అరెస్టు చేస్తామని చెప్పారు. సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇవ్వడంతో అరెస్ట్ ప్రస్తావన ఉండదు గనుక ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నామని జడ్జి వెల్లడించారు. దీంతో, ముందస్తు బెయిల్‌కు అవకాశమున్న అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించి ఉండొచ్చని లోకేష్ తరఫు లాయర్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో, ఢిల్లీలో ఉన్న లోకేష్ కు 41 ఏ నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
మరోవైపు, స్కిల్, ఫైబర్ గ్రిడ్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ లోకేష్ తరఫు లాయర్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై ఈ రోజు మధ్యాహ్నం విచారణ జరగనుంది.