40వ వసంతంలోకి అడుగు పెట్టిన అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా టీడీపీ రికార్డు సృష్టించింది. భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, మాజీ మంత్రులు, శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కేకులు కట్ చేసుకున్నారు. భవిష్యత్తులో అధికారంలోకి రావడమే పరమావధి అని సంకల్పం చెప్పుకొన్నారు. టీడీపీని పరుగులు పెట్టిస్తామని.. ప్రతిజ్ఞలు చేశారు. అంతా బాగానే ఉంది.. మరి ఆదిశగా కార్యాచరణ ప్రణాళిక ఏమై నా ఉందా? పెట్టుకున్న లక్ష్యాలు, చేసుకున్న సంకల్పాలను సాధించే దిశగా వేసే అడుగులు ఎలా పడుతు న్నాయి? ఇప్పటివరకు జరిగిన చరిత్ర, రానున్న భవిష్యత్తు.. ఈ మధ్యలో పార్టీ పడుతున్న ఆపశోపాలు.. చర్చకు వస్తున్నాయి.
నాటి పరిస్థితి నేడేదీ?
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో దివంగత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీలో కాలానుగుణ మా ర్పులను ఆహ్వానించాల్సిందే. అయితే.. అవి పార్టీకి.. మేలు చేసేవిగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ, ఈ పరిస్థితి కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. మంచో చెడో ఒక సిద్ధాంతం అంటూ ఏర్పాటు చేసుకున్నాక.. దానికే కట్టుబడాల్సిన అవసరం ఉంది. దీనిని ఎన్టీఆర్ ఆచరించి చూపించారు. అందుకే పార్టీపై ఆయన ముద్ర ఇప్పటికీ అలానే ఉంది. ఇక, ఆ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు.. కొన్నాళ్లు బాగానే పనిచేసినా.. వ్యూహాత్మక విధానాలు అనుసరించడంలో విఫలమయ్యారనే వాదన గత ఎన్నికలకు ముందు బాహాటంగానే వినిపించింది.
అతి విశ్వాసం..
ప్రధానంగా… ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే.. టీడీపీ పుట్టుకువచ్చిందో.. ఆ పార్టీతోనే చంద్రబాబు తెలంగా ణ ఎన్నికల్లో 2018లో జట్టు కట్టడం.. పార్టీని పలుచన చేసింది. ఆది నుంచి టీడీపీతో ఉన్న కమ్యూనిస్టుల ను దూరం చేసుకోవడం.. పార్టీకి చేటు చేసిందనడంలో సందేహం లేదు. అదేసమయంలో అతి విశ్వాసం.. కూడా చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. గత ఎన్నికల విషయాన్నే తీసుకుంటే.. ఎన్నికల్లో క్షేత్ర స్థాయి నేతలు వద్దన్న వారికి కూడా టికెట్ ఇచ్చారు.. ఇది చాపకింద నీరు వంటి వ్యతిరేకతకు దారితీసిం ది. పసుపు-కుంకుమ తమను గెలిపించేస్తుందన్న అతి విశ్వాసం.. క్షేత్రస్థాయిలో తమ్ముళ్లు సాగించిన అవినీతి బాగోతం.. వంటివి తెలిసి కూడా బాబు కట్టడి చేయలేక పోవడం వంటివి పార్టీకి శరాఘాతాలుగా పరిణమించాయి.
పుత్రోత్సాహం
ఇక, 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే.. తన కుమారుడు లోకేష్‌ను ఎమ్మెల్సీ చేసి.. మంత్రిప దవిని ఇచ్చుకోవడం.. సొంతపార్టీలోనే సీనియర్లకు మంటపుట్టించింది. ఒక్కొక్క మెట్టు.. ఎదిగేలా చేసి.. పదవులు అందిపుచ్చుకునేందుకు తనే అర్హత సంపాయించుకునేలా బాబు లోకేష్‌ను తీర్చిదిద్ది ఉండా ల్సిందనే వాదన ఉంది. ఈ పరిణామం.. కూడా పార్టీని ప్రజల్లో నవ్వుల పాలయ్యేలా చేసింది. సుదీర్ఘ రాజ కీయ చరిత్ర ఉందని చెప్పుకొనే చంద్రబాబు తన కుమారుడి విషయంలో వ్యవహరించిన తీరు సరికాదనే వ్యాఖ్యలు ఇప్పటికీ పార్టీలో వినిపిస్తూనే ఉన్నాయి.
వ్యూహ లేమి!!
2014 ఎన్నికల సమయంలో జనసేన, బీజేపీలతో కలిసి ముందుకు సాగిన చంద్రబాబు.. ఆ తర్వాత.. ఆ యా పార్టీలతో ఐదేళ్లూ మిత్రత్వాన్ని కొనసాగించలేక పోవడం.. ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో నిలవడం.. వ్యూహాలు లేకపోవడం.. వైసీపీ వేసిన ప్రతివ్యూహాల్లో చిక్కుకోవడం వంటివి పార్టీని ప్రజల్లో పలుచన చేశా యనే చెప్పాలి. ఇక, ప్రత్యేక హోదా.. పోలవరం వంటివిషయాలు.. కూడా బాబుకు ఇబ్బందిగా పరిణమిం చాయి. ఇక, వైసీపీ నుంచి గెలిచిన నాయకులను టీడీపీలోకి తీసుకుని పదవులు ఇవ్వడం.. అప్పటి కే ఉన్న సీనియర్లను పక్కన పెట్టడం వంటి పరిణామాలు కూడా బాబుపై విమర్శలకు అవకాశం ఇచ్చింది.
తమ్ముళ్ల ఆధిపత్యం
పార్టీలో అధినేత మాటకు గౌరవం ఉండాలి. ఆయన చెప్పింది వేదంగా పాటించే నేతలు ఉండాలి. కానీ, టీడీపీలో ఈ చివర నుంచి ఆ చివరి వరకు నేతలు ఉన్నా.. ఆధిపత్య రాజకీయాలకు నెలవులుగా మారిపోయారు. అధినేత మాటను పట్టించుకునే నాయకులు కరువయ్యారనే విషయం.. బాబుకు కూడా తెలిసిందే. అయినా… ఎక్కడ కోప్పడితే.. ఎక్కడ బయటకు వెళ్లిపోతారో.. అనే జంకు కారణంగా.. ఎవరినీ సరైన మార్గంలో పెట్టలేక పోయారనే వాదన ఉంది. ఈ పరిస్థితి తామర తంపరమాదిరిగా మారి.. నేతల మధ్య సఖ్యత.. పార్టీలో ఐక్యత లోపించాయి.
భవిష్యత్తు ఏంటి?
తప్పులు సరే! భవిష్యత్తు మాటేంటి? అనేది ఇప్పుడు చంద్రబాబు ముందున్న ప్రధాన ప్రశ్న. ఒక్కఛాన్స్ తో అధికారం దక్కించుకున్నారు.. ప్రజలు కూడా ఒక్క ఛాన్సే ఇచ్చారు కనుక మలివిడత అధికారం మన దే అనే భావన చాలా మంది నేతల్లో కనిపిస్తోంది. దీనిని సంపూర్ణంగా తుడిచి పెట్టి.. `జీరో` స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. యువతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు.. వృద్ధ నేతల ను కేవలం సలహాలవరకే పరిమితం చేయాలి.
దీనిని వైసీపీనే ఉదాహరణ. అనేక మంది వృద్ధ నేతలను పక్కన పెట్టి.. యువతకు జగన్ అవకాశం కల్పించారు. ఈ తరహా రాజకీయం అమలు చేయడంతోపాటు.. ప్రజల్లో పార్టీపై భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. పార్టీలో ఏం జరుగుతోంది? ఎక్కడ ఏనేత ఎలా వ్యవహరిస్తున్నారు? అని తెలుసుకుని .. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు కాయకల్ప చికిత్సలు చేస్తేనే.. పార్టీ పురోభివృద్ధి సాధ్యం తప్ప… పగటి కలలతో పార్టీ పట్టుసాధించడం చాలా కష్టమే!!