భారీతనానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తుంది ఈ అపార్టుమెంట్. అపార్టుమెంట్ అంటే సింగిల్ డిజిట్ నుంచి ట్రిపుల్ డిజిట్ మామూలే. కాదు.. కూదంటే కొన్ని ప్రాజెక్టులు వేలల్లోనూ ఉంటాయి. కానీ.. ఇప్పుడు చెప్పేది అలాంటి ఇలాంటి అపార్టుమెంట్ కాదు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ అపార్టుమెంట్ గురించి విన్న తర్వాత.. భారీతనం అనే మాటకు అర్థం ఇదా? అన్న భావన కలుగక మానదు. చైనాలోని కియాన్ జియాంగ్ సెంచురీ నగరం ఉంది. ఆ సిటీ ప్రత్యేకత ఏమంటే.. ప్రపంచంలోనే అతి పెద్ద అపార్టుమెంట్ ఇక్కడే ఉంది.
ఎస్ ఆకారంలో ఉండే ఈ భారీ భవన సముదాయం మొత్తం 39 అంతస్తుల్లో ఉంది. 14 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ భవనంలో 30 వేల మంది నివసించేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. 30వేల మంది ఉన్న వేళ.. రద్దీ మాటేమిటి? వసతుల మాటేమిటి? అన్న ప్రశ్నలు సహజంగా తలెత్తుతాయి. ఇలాంటివెన్నో పక్కాగా ఆలోచించి దీన్ని నిర్మించినట్లుగా చెబుతున్నారు. ఎందుకుంటే ఈ భారీ అపార్టుమెంట్ లో వసతులకు.. సదుపాయాలకు కొదవే ఉండదని చెబుతున్నారు.
ఈ అపార్టుమెంట్ నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమస్తాన్ని ఇక్కడే సెట్ చేశారనిచెబుతున్నారు. షాపింగ్ మాల్స్.. రెస్టారెంట్లు.. స్కూళ్లు.. ఆసుపత్రులు..ఫిట్ నెస్ కేంద్రాలు.. ఫుడ్ కోర్టులు.. స్విమ్మింగ్ పూల్స్.. నిత్యవసర దుకాణాలు.. సెలూన్లు.. ఎంటర్ టైన్ మెంట్ కు కొదవ లేకుండా అన్ని సెటప్ లు సెట్ చేశారు. అంతేకాదు.. ఆహ్లాదకరమైన పార్కులు కూడా ఇందులో ఏర్పాటు చేయటం మరో ప్రత్యేకత.
ఇప్పటికే ఈ భారీ భవన సముదాయంలో 20 వేల మంది నివాసం ఉంటున్నారు. మరో 10 వేల మంది వరకు ఉండే వీలుంది. ఇంతకూ ఇంత భారీ భవన సముదాయంలో అద్దెల మాటేమిటి? అన్న సందేహం రావొచ్చు. మన రూపాయిల్లో చెప్పాలంటే కనిష్ఠంగా రూ.18 వేల నుంచి గరిష్ఠంగా రూ.50 వేల వరకు అద్దెలు ఉంటాయని చెబుతున్నారు. నిజానికి ఈ భవనాన్ని 2013లోనే ప్రారంభించారు.
అయితే.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో రావటం.. అది కాస్తా వైరల్ కావటంతో దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కొత్త గుర్తింపు వచ్చింది. అర్కిక్టుల ప్రతిభకు ఈ భారీ భవన సముదాయం ఒక నిదర్శనంగా చెబుతున్నప్పటికీ.. భారీ భూకంపాల సమయంలో మాత్రం రెస్క్యూ చేయటం మాత్రం తిప్పేలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజమే కదా?