వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు.
ఎన్నికల్లో కూడా వారాహి వాహ నంపైనే ఆయన ప్రచారం చేయనున్నారు.
దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి తెచ్చుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక, యాత్రకు సంబంధించిన షెడ్యూల్ను కూడా తాజాగా విడుద ల చేశారు.
ఈ నెల 30(శనివారం) నుంచి ఆయన ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు.
ఈ ప్రచార కార్యక్రమానికి ‘వారాహి విజయభేరి’ అని నామకరణం చేశారు.
తాను అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే పవన్ తన వారాహి విజయభేరి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు.
తొలి సభ ఈ నెల 30న చేబ్రోలు రామాలయం సెంటర్ లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది.
కాగా, పవన్ ప్రచార కార్యక్రమాల్లో భద్రతా వ్యవహారాల సమన్వయకర్తలుగా అందె నరేన్, మిథిల్ జైన్ లను నియమించారు. వీరి నియామకానికి పవన్ ఆమోద ముద్ర వేశారు.
ప్రస్తుతం ఎన్నికల్లో కూటమి పార్టీల తరఫున సీట్లు పంచుకున్నారు.
మొత్తం 21 స్థానాల్లో జనసేన పోటీకి రెడీ అయింది. ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక, మరికొన్ని స్థానాలకు ప్రకటిం చాల్సి ఉంది.
ఇదిలావుంటే..వైసీపీ మేం సైతం సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక, టీడీపీ కూడా ప్రజా గళం పేరుతో యాత్రలు చేస్తోంది.
ఇక, ఈ క్రమంలో బీజేపీ `నిజం తెలియాలి పేరుతో యాత్రలకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. మొత్తంగా చూస్తే.. మూడు పార్టీలు కూడా దుమ్ము రేపనున్నాయి.
ఒక్క పవన్ విషయానికి వస్తే.. ఆయన మొత్తం మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ముందుగా ఉభయ గోదావరి జిల్లాలు, తర్వాత.. శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర, తర్వాత… కోస్తాలతో ఆయన ప్రచారం పరిమితం చేయనున్నారు.
అయితే.. కడపలో కూటమి పక్షాన ఎవరైనా నిలబడితే మాత్రం.. అక్కడ ప్రచారం చేస్తారని అంటున్నారు.