ఏపీ ఆర్థిక శాఖ లెక్కల్లో జమాఖర్చుల వ్యవహారం తేడా కొడుతోందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలు పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు…ఏకంగా రూ.40వేల కోట్ల రూపాయలకు సరైన లెక్కలు లేవని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పయ్యావుల ఫిర్యాదు చేయడంతో జగన్ ఇరకాటంలో పడ్డారు. బడ్డీ కొట్లు కూడా పద్దులు రాసుకుంటాయని, అలాంటిది రూ.41 వేల కోట్లకు పద్దులు రాయలేదంటే జగన్ ఏం సమాధానం చెప్తారని పయ్యావుల నిలదీశారు.
దీంతోపాటు, ఏపీ సర్కార్ అందినకాడికి అప్పులు చేస్తోందని, రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలోకి నెడుతున్నారని కాగ్ కూడా సంచలన నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తమ ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, లెక్కలు బయటకు వెళ్లడంపై జగన్ సర్కార్ గుర్రుగా ఉంది. తమ గుట్టును ఎవరో రట్టు చేస్తున్నారని నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే ఆర్ధిక శాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను జగన్ సర్కార్ సస్పెండ్ చేయడం కలకలం రేపింది.
ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లతో పాటు ఒక అసిస్టెంట్ సెక్రెటరీని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం కలకలం రేపింది. ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న డి.శ్రీనిబాబు, కే.వరప్రసాద్, అసిస్టెంట్ సెక్రెటరీ నాగులపాటి వెంకటేశ్వర్ లను సస్పెండ్ చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడం పెను దుమారం రేపుతోంది. ఏపీ ఆర్థిక శాఖకు చెందిన సమాచారాన్ని ఈ ముగ్గరూ లీక్ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు, ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ ముగ్గురూ హెడ్ క్యార్టర్ విడిచి వెళ్లరాదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వేటు పడిని ఉద్యోగులకు మిగతా ఉద్యోగులు అండగా ఉండాలని ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నాయి.