దేశంలోని చాలా రాష్ట్రాలు సీరియస్ గా తీసుకోవటం లేదు కానీ దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎంతలా ఉందన్న విషయంపై ఢిల్లీ.. కేరళ రాష్ట్రాలు తొలుత ఎఫెక్టు అయ్యాయి. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా లేకపోవటంతో.. ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పరిణామాలు నార్మల్ కు వచ్చేస్తున్నాయి.
ఇలాంటివేళలోనే.. సెకండ్ వేవ్ విరుచుకుపడే వీలుందన్న మాట వినిపిస్తోంది.
ఇందుకు తగ్గట్లే.. దేశంలోని ఢిల్లీ.. కేరళ రాష్ట్రాల్లో కరోనా విరుచుకుపడుతోంది. పాజిటివ్ కేసులతో పాటు..కొత్తగా మరణిస్తున్న వారి సంఖ్య భారీగా ఉండటంపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సెకండ్ వేవ్ వేళ.. ప్రభుత్వ ఏర్పాట్లను ఢిల్లీ హైకోర్టు సైతం తప్ప పట్టింది. దీంతో రంగంలోకి దిగిన కేజ్రీ సర్కారు.. కంట్రోల్ చర్యల్నిచేపట్టింది. ఇప్పటివరకు మాస్కులు పెట్టుకోకుండా రోడ్ల మీదకు వచ్చే వారికి రూ.500 ఫైన్ విధించేవారు. ఇప్పుడు దాన్ని రూ.2వేలకు పెంచేసేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాదు.. వైద్య సేవల కొరత రానివ్వకుండా ఉండేందుకు వీలుగా ఎంబీబీఎస్ నాలుగైదు సంవత్సరాల విద్యార్థుల సేవల్ని వినియోగించుకోవాలని ఢిల్లీ సర్కారు డిసైడ్ అయ్యింది. దీనికి సంబంధించిన ఆదేశాల్ని జారీ చేసింది. ఈ విద్యార్థులు ఎనిమిది గంటలు పని చేస్తే.. రోజుకు వెయ్యి రూపాయిలు.. అదే పన్నెండు గంటలు పని చేస్తే రూ.2 వేల గౌరవ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని చూస్తే.. కరోనా సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉందన్నది అర్థమవుతోంది. ఢిల్లీ ఎపిసోడ్ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త త్వరగా మేల్కొంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.