వయసు 29 ఏళ్లు. మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏమిటని ప్రశ్నించినంతనే బోలెడంత లిస్టు బయటకు వస్తుంది. బీటెక్ పూర్తి చేసి.. ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగినిగా పని చేస్తున్న ఒక సగటు అమ్మాయి.. అసాధారణ నిర్ణయం తీసుకోవటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు అందరూ ఆమె గురించి మాట్లాడుకునేలా హాట్ టాపిక్ గా మారింది. అదిలాబాద్ కు చెందిన 29 ఏళ్ల ఐటీ ఉద్యోగిని ట్వింకిల్ తన బీటెక్ ను హైదరాబాద్ లో పూర్తి చేశారు. తాజాగా ఆమె జైన సన్యాసినిగా మారాలనుకోవటం.. ఆ దిశగా అడుగులు వేయటంతో వార్తల్లోకి వచ్చారు.
2007లో జైన మతగురువు రాంలాల్ జీ మహరాజ్ బోధనలకు ఆకర్షితురాలైన ఆమె.. తన కుటుంబ సభ్యుల అనుమతి తీసుకొని జైన మత సన్యాసినిగా మారాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా అదిలాబాద్ లో శనివారం సంప్రదాయబద్ధమైన క్రతువు మొదలు పెట్టారు.
ట్వింకల్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ఆమె అదిలాబాద్ టౌన్ కుమార్ పేటకు చెందిన శ్వేతా.. గిరీశ్ ల కుమార్తె. వారికి ఇద్దరు సంతానం కాగా.. ఒక అబ్బాయి.. అమ్మాయి. అబ్బాయి వ్యాపారం చేస్తుండగా.. కుమార్తె మాత్రం ఐటీ ఉద్యోగినిబాగా జాబ్ చేస్తున్నారు. అయితే.. తాను సన్యాసినిగా మారాలనుకున్న విషయాన్ని ఇంట్లో వారికి చెప్పారు. ఆమె నిర్ణయంపై విస్మయం వ్యక్తమైనా.. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ.. ఒప్పుకున్నారు.
దీంతో.. సంప్రదాయ పద్దతిలో క్రతువు మొదలైంది. చందన మండప పూజ క్రతువు ఈ రోజు(ఆదివారం)తో ముగియనుంది. ఈ నెల 22న మధ్యప్రదేశ్ లోని జావ్ దాలో దీక్షా మహాత్సవం.. మహాభినిష్క్రమణ అనంతరం ఆమె జైన సన్యాసినిగా మారనున్నారు. సన్యాసినిగా మారుతున్నందుకు తాను ఎంతో ఆనందంతో ఉన్నట్లుగా ఆమె వెల్లడించారు.