దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపుతో తెలంగాణ బీజేపీ జోరు పెంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీనిచ్చింది. దీంతో, త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై గులాబీ బాస్ కేసీఆర్ గట్టిగా ఫోకస్ చేశారు. సాగర్ ఓటర్లకు తనదైన శైలిలో సంక్షేమ పథకాలు, ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం వంటి హామీలిచ్చిన కేసీఆర్…తాజాగా గత ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లకు ఇచ్చిన హామీలపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్ రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు 29 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు కేసీఆర్ సూచన ప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది.
ఏపీలో 27 శాతం ఐఆర్ ఇస్తుండగా…అక్కడి కంటే 2 శాతం ఎక్కువగా ఫిట్మెంట్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల సంఘాల ప్రతినిధులు అంటున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్న వేతన కమిషన్ సిఫారసుతో సంబంధం లేకుండా ఫిట్మెంట్ అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఆ సిఫారసుపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచే కొత్త వేతన సవరణ అమల్లోకి వస్తుందని కూడా కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వేతన సవరణతోపాటు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తెప్పించడం, పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచడంతోపాటు 2003-04 సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.