ప్రతిపక్ష నేతగా అమరావతి రాజధానికి జై కొట్టిన జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానులు అంటూ కొత్త పల్లవిని అందుకున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇక, విశాఖ పాలనా రాజధాని అని చెప్పిన జగన్ అక్కడ అప్పణంగా భూములు దోచుకునేందుకు ఎంపీ విజయ సాయిరెడ్డి ని నియమించారని ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోసిన సంగతి కూడా తెలిసిందే. విపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నా సరే వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు.
ఈ క్రమంలోనే తాజాగా విశాఖలో భూదోపిడికి కర్త కర్మ క్రియ అయిన విజయసాయిరెడ్డి కన్ను జాలరి పేటలోని భూములపై పడిందని జనసేన నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పెద్ద జాలరి పేట భూముల డీల్ లో రూ.2800 కోట్ల అవినీతికి సాయి రెడ్డి తెరలేపారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని దశాబ్దాలుగా అక్కడే నివాసం ఉంటున్న జాలరిపేట వాసులకు ఆ భూమి చెందదని కొత్త వాదనను అధికారులు తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. జాలరిపేట భూములపై రాణి సాహెబా వారసులకి హక్కుందని, ఈ భూమి వారికే చెందాలని ఒక కాగితాన్ని తెచ్చి వేల కోట్ల స్కామ్ కు తెర తీశారని ఆయన ఆరోపించారు.
ఆ భూమిని రాణి సాహెబా వారసులు క్లైమ్ చేస్తున్నారని, అక్కడ భూముల రిజిస్ట్రేషన్ వ్యాల్యూను పెంచి చూపిస్తున్నారని ఆరోపించారు. ఆ స్థలం మత్స్యకారులకు చెందదని రాణి సాహెబా వారసులను తెరపైకి తెచ్చి, అందుకు ప్రతిఫలంగా 2800 కోట్ల రూపాయల విలువైన టిడిఆర్ బాండ్లు పొందేందుకు ఫైలును యుద్ధ ప్రాతిపదికన అధికారులు కదుపుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ హయాంలో, ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో జాలరి పేట వాసులకు పట్టాలు మంజూరయ్యాయని చెప్పారు. జాలరిపేట తరహాలో రాష్ట్రంలో ఎన్నో భూములున్నాయని, అన్నింటికీ టీడీఆర్ బాండ్లు ఇస్తారా అని ప్రశ్నించారు.