నారా చంద్రబాబు నాయుడు అనే నేను….అని 27 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధనేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు.1995, సెప్టెంబర్ 1న సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడని చంద్రబాబు ఏకధాటిగా 8 సంవత్సరాల 8 నెలల 13 రోజులపాటు ఆ పదవిలో ఉన్నారు. విజనరీ లీడర్ అనే పదాన్ని తొలిసారిగా యావత్ భారత దేశానికి పరిచయం చేసిన దార్శనీకుడు చంద్రబాబు.
ఇక, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా నవ్యాంధ్రప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కింది. నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా, ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్న చంద్రబాబుకే సాధ్యమని ప్రజలు నమ్మి ఆయనకు పట్టం కట్టారు. ఇలా మొత్తం 13 సంవత్సరాల 7 నెలల 35 రోజుల పాటు ముఖ్యమంత్రిగా అశేషాంధ్ర ప్రజలకు సేవ చేసిన జననేత చంద్రబాబు.
మనదేశ రాజకీయ రంగంలో సుస్పష్టమైన ప్రణాళిక,దార్శనికత, ముందుచూపు కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ఒకరు. విజన్ 2020 పేరుతో నేడు ఇరు తెలుగు రాష్ట్రాలు సాధించిన అభివృద్ధికి ఏనాడో బీజాలు వేసిన రాజకీయ మేధావి చంద్రబాబు. 1956 నుండి 2022 వరకు రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తన సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ఉమ్మడి ఏపీపై, నవ్యాంధ్రపై చెరగని ముద్ర వేసిన మార్గదర్శి చంద్రబాబు.
యువకుడి నుంచి ఏడు పదుల వయసు వరకు ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధికోసం చంద్రబాబు చేసిన కృషిని, సేవలు వెలకట్టలేనివి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదేళ్ల పరిపాలనలో, నవ్యాంధ్రలో ఐదేళ్ల పాలనలోగానీ చంద్రబాబు తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నారు. భారతదేశ చిత్రపటంలో ఏపీని అగ్రగామిగా నిలిపిన ఘనత చంద్రబాబుదనడంలో ఎటువంటి సందేహం లేదు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 27 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.