సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లోక్ సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు పోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ప్రకటించారు. మొత్తం 7 దశలలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 19న తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నాలుగో దశ ఎన్నికలలో భాగంగా మే 13న ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు, తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల షెడ్యూల్:
ఎన్నికల నోటిఫికేషన్: ఏప్రిల్ 18
నామినేషన్ల గడువు: ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 26
నామినేషన్ల ఉపసంహరణ: ఏప్రిల్ 29
పోలింగ్ తేదీ: మే 13
ఓట్ల లెక్కింపు, ఫలితాలు: జూన్ 4
లోక్ సభ తొలి దశ ఎన్నికలు 21 రాష్ట్రాలలో 102 స్థానాలకు గాను ఏప్రిల్ 19న జరగనున్నాయి. రెండో దశలో ఏప్రిల్ 26న 13 రాష్ట్రాలలోని 89 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక, మే 7న 12 రాష్ట్రాలలోని 94 స్థానాలకు మూడో దశ ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న 10 రాష్ట్రాలలోని 96 స్థానాలకు నాలుగో దశలో భాగంగా పోలింగ్ జరగనుంది. ఈ దశలోనే ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక, మే 20వ తేదీన 8 రాష్ట్రాలలోని 49 స్థానాలకు ఐదో దశ ఎన్నికలు, మే 25వ తేదీన ఏడు రాష్ట్రాలలోని 57 స్థానాలకు ఆరో దశ ఎన్నికలు, జూన్ 1న 8 రాష్ట్రాలలోని 57 స్థానాలకు ఏడో దశ ఎన్నికలు జరగబోతున్నాయి.
లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరగనున్నాయి.
తొలి దశ ఎన్నికలకు మార్చి 20న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఏప్రిల్ 19న పోలింగ్
రెండో దశ ఎన్నికలకు మార్చి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 26న పోలింగ్
మూడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది. మే 7న పోలింగ్
నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 13న పోలింగ్
ఐదో విడత లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 26న నోటిఫికేషన్, మే 20న పోలింగ్ జరగనుంది.
ఆరో విడత లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 29న నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 25న పోలింగ్
ఏడో విడత ఎన్నికలకు మే 7న నోటిఫికేషన్ విడుదల కానుండగా, జూన్ 1న పోలింగ్
17వ లోక్ సభ గడువు జూన్ 16తో ముగియనుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీల గడువు జూన్ 2న, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16న, ఒడిశా అసెంబ్లీ గడువు జూన్ 24న ముగియనున్నాయి.