మరో రెండు సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని అంచనా వేసుకుంటే.. ఏ ప్రాంత ప్రజలు ఎటు మొగ్గుతున్నారనే వాదన తెరమీదికి వస్తోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈ విషయంలో ముందుగానే అంచనాలు వేస్తోంది. అదేసమయంలో వైసీపీ కూడా అంత లోతుగా కాకపోయినా.. సీరియస్‌గానే ఈ విషయాన్ని పరిశీలిస్తుండడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి అంటే.. టీడీపీకి కంచుకోట. ఇక్కడ నుంచి అనేక సందర్భాల్లో టీడీపీ నాయకులు విజయం దక్కించుకున్నారు.
అయితే.. 2019లో అనూహ్యంగా రెండు నియోజకవర్గాలు పాలకొల్లు, ఉండి తప్ప.. మిగిలిన అన్నిచోట్లా వైసీపీ విజయం దక్కించుకుంది. అయితే.. రెండున్నరేళ్ల తర్వాత.. పరిస్థితి ఎలా ఉంది? అని గమనిస్తే.. వైసీపీ నేతల మధ్య నెలకొన్న వివాదాలు.. విభేదాలు.. పార్టీని కొంత మేరకు ఇబ్బందుల్లోకి నెట్టే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా నరసాపురం ఎంపీ.. రఘురామ కృష్ణరాజు… చేస్తున్న వ్యతిరేక ప్రచారం… ఏలూరు ఎంపీ.. దెందులూరు ఎమ్మెల్యేల వివాదాలు.. అదేసమయంలో ఆచంటలోనే పార్టీ బలం తగ్గుముఖం పడుతుండడం వంటివి వైసీపీకి ఇబ్బందిగా మారాయి.
అదేసమయంలో జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీ గెలిచినా.. ఇటీవల కాలంలో టీడీపీ పుంజుకుంటున్న పరిణామాలు కనిపిస్తున్నాయని అంచనా ఉంది. అయితే.. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి నాని దూకుడు బాగుందనే టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా భీమవరంలోనూ వైసీపీ ఆదరణ బాగానే ఉంది. మొత్తంగా ఆయా పరిణామాలను నిశితంగా గమనిస్తున్న టీడీపీ తమకు ప్లస్ అయ్యే అవకాశాలపై ఒక అంచనావేసుకుంటోంది. జిల్లాలో బలమైన నాయకత్వం ఉంది. ఓటు బ్యాంకు కూడా ఇబ్బంది లేదు. సో.. కొంత కష్టపడితే.. గెలుపు గుర్రం ఎక్కొచ్చని టీడీపీ లెక్కలు వేస్తోంది.
అయితే.. వైసీపీ మాత్రం.. ఇంకా రెండున్నర సంవత్సరాల పాలనా కాలం ఉంది కాబట్టి.. అప్పటికి పరిస్థితి తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని.. అంటోంది. మరి ఏం చేస్తారో చూడాలి.