రేపటి పోలింగ్ లో జనాలివ్వబోయే తీర్పు కచ్చితంగా కేసీఆర్ పదేళ్ళ పరిపాలకు రెఫరెండమనే చెప్పాలి. ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన 2014 ఎన్నికల్లో జనాలు కేసీయార్ పైన పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు. అందుకనే అప్పుడు బొటాబొటి స్ధానాలిచ్చి సరిపెట్టారు. అధికారంలోకి వచ్చిన కేసీయార్ ప్రత్యర్ధిపార్టీల ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి కొందరిని లాక్కున్నారు. తర్వాత 2018 ఎన్నికల్లో జనాలు కేసీయార్ కు అనుకూలంగా స్పష్టమైన తీర్పిచ్చారు. అయితే 2014లో కేసీయార్ వైఖరికి 2018లో రెండోసారి గెలిచిన తర్వాత వైఖరికి చాలా మార్పొచ్చేసింది.
మొదటిసారి అధికారంలో ఉన్నపుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించేవారు. ఎప్పుడైతే రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారో అప్పటినుండే వైఖరి పూర్తిగా మారిపోయింది. దాంతో ప్రతిపక్షాలతో పాటు మామూలు జనాలను కూడా లెక్కచేయటం మానేశారు. దాంతో జనాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయింది. దాని ఫలితమే ఇప్పటి ఎన్నికల్లో ఎదురీత. నెలరోజుల వ్యవధిలో కేసీయార్ దాదాపు 93 నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించారు. అయితే వీటిల్లో ఎందులో కూడా పంచ్ కనబడలేదు.
గడచిన పదేళ్ళలో తాను ఏమి చేశానని చెప్పుకోవటంకన్నా కాంగ్రెస్ ను బూచిగా చూపించే ప్రయత్నమే ఎక్కువగా చేశారు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదేపదే విమర్శించటంలో కూడా చాలా తప్పులు మాట్లాడారు. ఇదే సమయంలో తన పరిపాలనను చాలా ఎక్కవగా హైలైట్ చేసుకున్నారు. లేని అభివృద్ధి జరిగినట్లుగా చెప్పుకున్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారెజీలను చూపించి లబ్దిపొందుదామని అనుకుంటే అదికాస్త రివర్సు కొట్టింది. పదేళ్ళుగా ప్రతిపక్షంలోనే ఉన్న కాంగ్రెస్ పై చేసేందుకు ఆరోపణలు లేక ఎప్పటిదో ఇందిరమ్మ రాజ్యంపైన ఆరోపణలు గుప్పించారు.
ఇదే సమయంలో ఇచ్చిన హామీలను తప్పటంతో జనాలకు మండిపోయింది. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్న కాంగ్రెస్ ఆరోపణలను జనాలు నమ్మారు. పదేళ్ళపాలనలో పెరిగిపోయిన అరాచకాలు, అవినీతి కారణంగా జనాలు అభ్యర్ధులను ప్రచారం కూడా చేసుకోవటానికి అంగీకరించలేదు. మొత్తానికి గ్రౌండ్ లెవల్లో జరిగిన ప్రచారం చూస్తే కేసీయార్ పదేళ్ళ పాలనకు గురువారం పోలింగ్ రెఫరెండమనే అనుకోవాలి. మరి జనాలు ఏమి తీర్పిస్తారో చూడాలి.