నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా ఏపీ సీఎం జగన్, వైసీపీలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మూడున్నరేళ్ల వైసీపీ అరాచక పాలనకు త్వరలోనే తెర పడనుందని, 2023లో పెనుమార్పులకు నాంది పడబోతుందని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష నేతలు, ఇతర పార్టీల కార్యకర్తలపై వైసీసీ నేతలు తప్పుడు కేసులు పెట్టి వేధించారని, అది చూసి జగన్, వైసీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు.
కందుకూరు ప్రమాదంలో టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు విడవడంతో టీడీపీ విషాదంలో ఉంటే…వైసీపీ అండ్ టీం రాక్షసానందం పొందుతోందని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛను కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో కూడా అంతర్యుద్ధం మొదలైందని, వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ఆ భయంతోనే జగన్ ముందస్తు ఎన్నికలంటున్నాడని అన్నారు.
ప్రధాని మోడీ దగ్గర కూడా జగన్ ముందస్తు గురించి ప్రస్తావించారట అని అన్నారు. తెలుగు జాతి ఎక్కడుంటే.. అక్కడ తానుంటానని.. అది తెలంగాణ, ఏపీ, చెన్నై అయిన కావచ్చని జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. తెలుగు వాళ్ల కోసం పెట్టిందే తెలుగుదేశమని అన్నారు. జగన్ నేతృత్వంలో విధ్వంసకర పాలన కొనసాగుతుందని, పోలీసుల అండదండలతో వైసీపీ గూండాలు, సైకోలు పెట్రేగిపోతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
జగన్ సీఎం అయినప్పటి నుంచి ప్రతీ ఏడాది విధ్వంసాల సంవత్సరమేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అందుకే 2022 విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సైకో అని తీవ్ర విమర్శలు చేశారు. ఏ రంగాన్ని వదలకుండా అన్ని రంగాలను భ్రష్టుపట్టించారని ఆరోపించారు. చివరకు మీడియాతోపాటు అనేక వ్యవస్థలపై దాడి చేసి పైశాచిక ఆనందం పొందారని నిప్పులు చెరిగారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని.. రాష్ట్రాన్ని దివాళా తీసేలా చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నప్పటికీ ముఖ్యమంత్రికి ఏ ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. అవినీతి సొమ్ముతో జగన్ అండ్ కో రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు.